40% ఓట్లపై రోజా కంపేరిజన్స్ బాగానే ఉన్నాయి కానీ...!
ఈ నేపథ్యంలో స్పందిస్తున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతున్నారు.
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2019లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ... 2024 ఎన్నికలకు వచ్చేసారికి 11 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతున్నారు. ఈ సమయంలో రోజా ఆసక్తికరంగా స్పందించారు.
అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం సైలంట్ గా ఉన్న రోజా ఇటీవల ఓ ట్వీట్ చేశారు. మంచి చేసి ఓడిపోయామని.. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదని అన్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు రోజా. ఈ సందర్భంగా ఆసక్తీక్రంగా స్పందించారు.
ఇందులో భాగంగా... ఇలాంటి ఓటమి రోజు ఒకటి ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని చెప్పిన రోజా.. తమకు 40శాతం ప్రజలు ఓటు వేశారని అన్నారు. ఈ సందర్భంగా... 40శాతం ఓట్లు వచ్చిన నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని.. తలంగాణలో 40శాతం ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డీ ముఖ్యమంత్రి అయ్యారని.. కానీ ఏపీలో మాత్రం 40శాతం ఓట్లు వచ్చిన తాము ఎలా ఓటమి చెందామన్నది మాత్రం అంతుబట్టడం లేదని అన్నారు.
తాజాగా ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... చంద్రబాబు ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చేలా పాలన సాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రుషికొండ వ్యవహారంపైనా రోజా స్పందించారు.
ఇందులో భాగంగా... టీడీపీ తన పాలనలో ఏనాడూ ఒక్క భవనాన్ని కూడా నిర్మించిన దాఖలాలు లేవని, వైసీపీ ప్రభుత్వ హయాంలోనిర్మించిన ఈ రుషికొండ భవన నిర్మాణాన్ని చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన భవనాన్ని రుషికొండలో నిర్మించడం తనకు గర్వంగా ఉందని తెలిపారు.
ఇదే సమయంలో... "ఆడుదాం ఆంధ్ర"లో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. వాస్తవానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మంజూరైన నిధులే రూ.100 కోట్లని చెప్పిన రోజా... రూ.100 కోట్లు స్కాం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని టీడీపీ విమర్శలు చేయాలని రోజా సూచించారు.
కాగా... కేంద్రంలో మోడీకి 40% ఓట్లు వచ్చినా కూటమిలో ప్రధాని కాగా... తెలంగాణలో బలమైన త్రిముఖ పోరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఏపీలో ప్రో జగన్, యాంటీ జగన్ అనే రెండే విషయాలపై ఎన్నికలు జరిగిన పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ పవన్ కల్యాణ్ మొదటి నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే... 40శాతం ఓట్లు వచ్చినా జగన్ కు సరిపడా సీట్లు రాలేదు! ఈ విషయం రోజా గమనించాలని అంటున్నారు పరిశీలకులు.