ఖాళీ అవుతున్న హైదరాబాద్... హైవేలపై వాహనాల వరద!
సంక్రాతి మొదలైందంటే.. నిత్యం ఇసుకేస్తే రాళనంతగా అన్నట్లుగా వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతుంటాయి.
సంక్రాతి మొదలైందంటే.. నిత్యం ఇసుకేస్తే రాళనంతగా అన్నట్లుగా వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతుంటాయి. నగరవాసులు గరిష్టంగా తమ తమ గ్రామాలకు పయణమై వెళ్తుంటారు. పైగా ఈ సారి శనివారం, ఆదివారం కూడా కలిసి రావడంతో సుమారు వారం రోజుల వరకూ ఊరిలో ఎంజాయ్ చేయనున్నారు.
అవును... సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూ కట్టారు. దీంతో.. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కాయి. ఈ క్రమంలో ప్రధానంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచీ రద్దీ పెరిగింది. అబ్దులాపూర్ మెట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జాం నెలకొన్న పరిస్థితి.
టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో.. టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఈ రద్దీ నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈ సమయంలో 10 టోల్ బూత్ ద్వారా ఏపీ వైపు వెళ్తున్నవారిని సిబ్బంది తొలుత పంపించేస్తుండగా.. హైదరాబాద్ వైపు వస్తున్న వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. శని, ఆదివారాల్లో పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
అదేవిధంగా... చౌటుప్పల్ చౌరాస్తాలో అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జాం భారీగా ఏర్పడుతున్న వేళ.. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ బస్టాండ్లు కిటకిట లాడుతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే... ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దీంతో... వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలతో నందిగామ "వై" జంక్షన్ వద్దా ట్రఫిక్ జామ్ ఏర్పడింది.