2 రోజుల్లో అన్ని కోట్ల అమెజాన్ షేర్ల అమ్మకం.. ఎందుకిలా?
అమెజాన్ సీఈవోగా 2021 నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారి ఆయన తన షేర్లను అమ్మకానికి పెట్టారు.
చెప్పినట్లే చేశారు ప్రపంచ బిలియనీర్ కం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. వచ్చే ఏడాది జనవరి నాటికి 5 కోట్ల అమెజాన్ షేర్లను అమ్మేస్తానని చెప్పిన ఆయన.. అందుకు తగ్గట్లే గత వారంలోని రెండు రోజుల వ్యవధిలో 1.2కోట్ల అమెజాన్ షేర్లను అమ్మేసినట్లుగా తాజాగా ప్రకటించారు. వీటి విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
అమెజాన్ సీఈవోగా 2021 నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారి ఆయన తన షేర్లను అమ్మకానికి పెట్టారు. గత నవంబరులో 2025 జనవరి నాటికి తన వద్ద ఉన్న షేర్లలో 5కోట్ల షేర్లను అమ్మాలన్న నిర్ణయాన్ని ప్రకటించటం.. అందుకు తగ్గట్లే తాజాగా అమ్మటం జరిగింది. ఆయన అమ్మిన షేర్లు మొత్తం ఒక్కొక్క షేరు 169.7 డాలర్ల నుంచి 171.02 డాలర్ల మధ్య అమ్మినట్లుగా పేర్కొన్నారు.
శుక్రవారం అమెజాన్ షేరు ధర 174.45 దగ్గర స్థిరపడింది. గడిచిన పన్నెండు నెలల్లో అమెజాన్ షేరు ధర 78 శాతం పుంజుకుంది. 2023 ఫిబ్రవరి నాటికి కంపెనీలో బెజోస్ కు 12.3 శాతం వాటా ఉంది. ఆయన చెప్పినట్లుగా 5 కోట్ల షేర్లను అమ్మిన తర్వాత కూడా అమెజాన్ లో ఆయన వాటా 11.8 శాతం ఉండటం చూస్తే.. ఆయన వద్ద అమెజాన్ షేర్లు ఎంత భారీగా ఉన్నాయో అర్థమవుతుంది.
ఇంతవరకు ఆయన సియాటెల్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. తన ఇంటిని అక్కడి నుంచి మియామీకి మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. షేర్లు.. బాండ్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు 2.5లక్షల డాలర్లు దాటితే 7 శాతం పన్నును సియాటెల్ లో నివాసం ఉంటే చెల్లించాలి. అదే.. మియామీకి మారటం ద్వారా ఆ పన్ను మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆయన అమ్మాలనుకున్న 5 కోట్ల షేర్లతో వచ్చిన ఆదాయం మీద దాదాపు 600 మిలియన్ డాలర్ల పన్ను ఆదా అవుతుంది. అందుకే ఆయన తన నివాసాన్ని మార్చుకున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన షేర్లను ఆయన అమ్మనున్నారు.