చెల్లెమ్మకు చెప్పనక్కరలేదు !

జైలులో ఉన్న వారిని కలవడానికి సమయం ఉంటుంది కానీ జనాల కోసం అసెంబ్లీకి వెళ్ళడానికి టైం ఉండదని ఘాటుగానే విమర్శించారు.

Update: 2025-02-20 17:15 GMT

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్ మీద విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఆమె తాజాగా జగన్ విజయవాడ టూర్ మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు. వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న వారిని కలవడానికి సమయం ఉంటుంది కానీ జనాల కోసం అసెంబ్లీకి వెళ్ళడానికి టైం ఉండదని ఘాటుగానే విమర్శించారు.

దాని మీద మీడియా వైసీపీ సీనియర్ నేత శాసన మండలిలో విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. షర్మిల విమర్శలకు జవాబు ఏమిటి అంటే దానికి బొత్స సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. షర్మిల విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు. విమర్శించాల్సింది అధికారంలో ఉన్న చంద్రబాబుని మోడీని.

అయితే బాబు పాలనలోనూ నరేంద్ర మోడీ ఏలుబడిలోనూ తప్పులు ఏమీ ఆమెకు కనిపించడం లేదని బొత్స ఫైర్ అయ్యారు. ఎంతసేపూ జగన్ మీదనే విమర్శలు చేస్తూంటారని అవన్నీ వ్యక్తిగతంగా కోపంతో చేస్తున్నవని అన్నారు అలాంటి వాటికి ఏమి జవాబు చెబుతామని ఆయన ప్రశ్నించారు.

రాజకీయ పార్టీలు విధానపరమైన విమర్శలు చేస్తే బదులిస్తామని బొత్స అనడం విశేషం. మొత్తానికి చూస్తే షర్మిల విమర్శలను బొత్స తీసి పక్కన పెట్టేశారు ఆమె వ్యక్తిగతంగా చేస్తున్నవి అని కొట్టిపారేశారు. పైగా జగన్ మీద కోపంతో అని మరోసారి జనంలో చర్చకు పెట్టారు.

నిజానికి చూస్తే షర్మిల జగన్ మీదనే విమర్శలు ఎక్కువగా చేస్తున్నారని కాంగ్రెస్ లోనూ చర్చ సాగుతోంది. అధికారంలో జగన్ లేరు. కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్ కి బలంగా ఉంటుంది. జనాలు కూడా ఆలోచిస్తారని అంటున్నారు.

కానీ షర్మిల పీసీసీ చీఫ్ హోదాలో ఎంతసేపూ వైసీపీ అధినేతనే టార్గెట్ చేయడం పట్ల కాంగ్రెస్ లోనూ చర్చ సాగుతోంది. అయితే ఏపీ విషయంలో జాతీయ కాంగ్రెస్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఇప్పట్లో ఏపీలో కాంగ్రెస్ ఎత్తిగిల్లదన్న అంచనాలేవో వారికి ఉన్నాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే షర్మిలను నియమించడం వెనక వైసీపీని వీక్ చేయడం లక్ష్యంగా ఉంది అని అంటున్నారు. అందుకే షర్మిల జగన్ ని విమర్శించడాన్ని జాతీయ కాంగ్రెస్ పెద్దలు కూడా ప్రోత్సహిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. వైసీపీ వీక్ అయితేనే ఏపీలో కాంగ్రెస్ బలపడుతుంది కాబట్టి షర్మిల రూట్ కరెక్ట్ అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారా అన్నది కూడా ఉంది. అయితే విపక్షంలో ఉంటూ సాటి విపక్షాన్ని కాంగ్రెస్ విమర్శించడం వల్ల పొలిటికల్ మైలేజ్ ఎంతవరకూ వస్తుంది అన్నది కూడా ఎవరికీ అర్థం కావడంలేదు అని అంటున్నారు.

Tags:    

Similar News