కాంగ్రెస్ చీఫ్‌గా ష‌ర్మిల‌.. 'విశ్వ‌స‌నీయ‌త' నిల్‌...!

అయితే.. వాస్త‌వానికి పార్టీ త‌ర‌ఫున నిల‌బ‌డే నాయ‌కుడికి, లేదా నాయ‌కురాలికి వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ ఉండి ఉండాలి.

Update: 2023-12-26 16:30 GMT

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నియ‌మితులవుతున్నార‌నే వార్త నిజ‌మో కాదో తెలియ‌దు కానీ.. రాజ‌కీయంగా మాత్రం ఈ వార్త సంచ‌ల‌నంగా మారింది. 2014కు ముందు రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోయింది. విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించిన ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను కాంగ్రెస్ లెక్క‌లోకి తీసుకోక‌పోవ‌డంతో ఆ పార్టీకి ప్ర‌జ‌లు స‌మాధి క‌ట్టేశారు.

ఇక‌, అప్ప‌టి నుంచి జ‌రిగిన రెండు అసెంబ్లీ ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు క‌నీసం ప‌ట్టించుకోను కూడా ప‌ట్టించుకోలేదు. ఇక‌, పార్టీకి అధ్య‌క్షులుగా ముగ్గురు మారినా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు. చివ‌ర‌కు రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉంటుంద‌ని.. తాము వ‌స్తే.. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా త‌ర్వాత జ‌రిగిన ఏ ఎన్నిక‌లోనూ ప్ర‌జ‌లు ఓటెత్త‌లేక పోయారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు అనూహ్యంగా వైఎస్ కుమార్తెను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతు న్నట్టు వ‌స్తున్న వార్తలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే.. ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్ పార్టీ.. పార్టీ ప‌రంగా కాకుండా వ్య‌క్తులతో డెవ‌ల‌ప్ అవుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి ఫేమ్‌తోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌నే వాద‌న ఉంది. గ‌తంలో రెండు సార్లు ఉమ్మ‌డి రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చినా.. అది వైఎస్ ఖాతాలోనే ప‌డింది.

ఈ నేప‌థ్యంలోఇప్పుడు ష‌ర్మిల‌ను రంగంలోకి దింపుతున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. వాస్త‌వానికి పార్టీ త‌ర‌ఫున నిల‌బ‌డే నాయ‌కుడికి, లేదా నాయ‌కురాలికి వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ ఉండి ఉండాలి. ఈ ర‌కంగా చూసుకుంటే ష‌ర్మిల‌కు ఉన్న ఇమేజ్ జీరోనే అనేది అభిప్రాయం. ఆమె తెలంగాణ‌లో పార్టీ పెట్టుకున్నారు. అక్క‌డ విఫ‌ల‌మ‌య్యారు.

ఏపీలో అన్న‌ను అధికారంలోకి తెచ్చాన‌ని చెప్పుకొన్నా.. చివ‌ర‌కు ఆయ‌న‌పైనేవ్య‌తిరేక జెండా ఎగ‌రేసి.. రెడ్డి సామాజిక వ‌ర్గంలోనూ ప‌లుచ‌న‌య్యారు. సో.. ఆమె విశ్వ‌స‌నీయ‌త ఇప్పుడు జీరో కావ‌డంతో కాంగ్రెస్ విష‌యంలో ఆమె ప్ర‌భావం కూడా అంతే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News