షర్మిల ఎఫెక్ట్ లేదా?
వైఎస్ వివేకా హత్య కేసును ప్రధానంగా ప్రస్తావిస్తూ కడప వైసీపీ సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని, జగన్‌ను టార్గెట్ చేస్తూ షర్మిల ప్రచారం చేశారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పని చేస్తున్నారు. ముఖ్యంగా తన అన్న జగన్‌ను గద్దె దించడం, వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ధ్యేయంతో సాగారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె స్వయంగా కడప ఎంపీగా పోటీ కూడా చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ప్రధానంగా ప్రస్తావిస్తూ కడప వైసీపీ సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని, జగన్‌ను టార్గెట్ చేస్తూ షర్మిల ప్రచారం చేశారు. కానీ షర్మిల పెద్దగా ఎఫెక్ట్ చూపలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఏపీలో లోక్‌సభ స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. వైసీపీ పంచుకుంటున్నాయి. అసలు కాంగ్రెస్ ఒక్క సీటు గెలుస్తుందని కూడా ఎవరూ చెప్పలేరు. షర్మిల గురించి ఎక్కడా చర్చలేదు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ కూటమి, వైసీపీ 25 లోక్‌సభ స్థానాలను పంచుకుంటున్నాయి. ఇందులో టీడీపీ కూటమికే మెజారిటీ స్థానాలు దక్కుతున్నాయని పోల్స్ చెబుతున్నాయి. దీంతో వైసీపీకి గట్టి షాకే తగిలిందనే చెప్పాలి.
మరోవైపు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా షర్మిల ప్రచారాన్ని హోరెత్తించారు. ముఖ్యంగా అవినాష్‌ను ఓడించాలనే పట్టుదలతో సాగారు. ఆమెకు వైఎస్ వివేకా తనయ సునీత, భార్య సౌభాగ్యమ్మ కూడా మద్దతుగా నిలిచారు. కడపలో ఆమె ప్రచారానికి కూడా జనాల నుంచి భారీ స్థాయిలో ఆదరణ దొరికింది. దీంతో షర్మిల విజయం సాధిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ ఏమో షర్మిలకు వ్యతిరేకంగా వచ్చాయి. మరి ఈ పోల్స్ నిజమవుతాయా? అసలు ఫలితాల్లో షర్మిల విజయాన్ని అందుకుంటుందా? అన్నది వేచి చూడాలి.