కర్ణాటకలో మరో ఛండాలం.. కార్యకర్తపై ఎమ్మెల్సీ అత్యాచారం
హాసన జిల్లాకు చెందిన పాతికేళ్ల జనతాదళ్ కార్యకర్త ఒకరు తనపై జరిగిన లైంగిక దౌర్జన్యం గురించి తన సుదీర్ఘ లేఖలో వాపోయాడు.
ఇప్పటికే కన్నడ చిత్రరంగానికి చెందిన దర్శన్ మర్డర్ కేసు శాండల్ వుడ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. ఇన్ని దరిద్రాలేందిరా బాబు అన్నట్లుగా ఆ వ్యవహారం ఉంది. దానికి కాస్త ముందు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ.. ఆయన సతీమణి భవానీల మీద కేసులు.. దానికి సంబంధించిన అంశాలు పెను సంచనలంగా మారటం తెలిసిందే.
ఇలాంటి వేళలోనే మరో ఛండాలం తెర మీదకు వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎమ్మెల్సీ ఒకరు తనపై అత్యాచారం చేశారని.. తనను తరచూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఒక యువకుడు రాసిన సుదీర్ఘ లేఖ ఇప్పుడు కర్ణాటకలో కొత్త కలకలాన్ని రేపుతోంది. లైంగిక వేధింపులకు గురవుతున్నానంటూ మహిళలు ఫిర్యాదు చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా ఒక యువకుడు ముందుకు వచ్చి.. పోలీసు డైరెక్టర్ జనరల్ కు.. హాసన జిల్లా ఎస్పీకి.. ముఖ్యమంత్రికి.. హోం మంత్రికి ఫిర్యాదు చేసిన వైనం షాకింగ్ గా మారింది.
హాసన జిల్లాకు చెందిన పాతికేళ్ల జనతాదళ్ కార్యకర్త ఒకరు తనపై జరిగిన లైంగిక దౌర్జన్యం గురించి తన సుదీర్ఘ లేఖలో వాపోయాడు. జాబ్ ఇప్పిస్తానని.. ఆర్థికంగా తనను ఆదుకుంటానని నమ్మించి సదరు ఎమ్మెల్సీ తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపించారు. దీంతో.. సదరు బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షల్లో అతడి ఒంటి మీద గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. సదరు యువకుడి ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని తాము సేకరిస్తున్నట్లుగా ఎస్పీ మహ్మద్ సజీదా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సదరు ఎమ్మెల్సీకి సంబంధించిన ముఖ్యుడు ఒకరు బయటకు వచ్చి ఖండించారు. రూ.5 కోట్లు ఇవ్వాలని సదరు కార్యకర్త డిమాండ్ చేశారని.. దాన్ని ఒప్పుకోనందుకు తమ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లుగా హోళెనరసీపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.