ఊడిన టైరు వెళ్లి.. పిల్లాడ్ని చంపేసింది
షాక్ కు గురైన సందీప్ కుటుంబ సభ్యులు పిల్లాడ్ని తీసుకొని ముత్తంగిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
చదివినంతనే నమ్మలేరు. కానీ.. నిజం. ఇదంతా చదివిన తర్వాత మాత్రం.. చావు రాసి పెట్టి ఉంటే ఏదోలా చంపేస్తుందన్న భావన మనసులో మెదలటం ఖాయం. అవుటర్ రింగు రోడ్డు మీద జరిగిన ఈ ఉదంతం షాక్ కు గురి చేస్తుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.అమీర్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి ఆదివారం రాత్రి ముత్తంగి దాబాలో డిన్నర్ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరాడు.
సుల్తాన్ పూర్ వద్ద వారి కారు ఓఆర్ఆర్ ఎక్కింది. కాసేపటికే తనకు యూరిన్ వస్తుందని.. కారు ఆపాలని సందీప్ కుమారుడు ఆరేళ్ల మోక్షిత్ రెడ్డి కోరాడు. కాసేపు ఆగమని చెప్పినా.. తనకు త్వరగా వస్తుందని చెప్పటంతో.. ఓఆర్ఆర్ కు ఒక పక్కన తన కారును ఆపాడు. రోడ్డు పక్కకు మోక్షిత్ ను తీసుకెళ్లగా.. అతడు మూత్ర విసర్జన చేస్తున్నాడు. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ.. గుర్తు తెలియని వాహనం టైరు వేగంగా దొర్లుకుంటూ వచ్చి వేగంగా అతడ్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు.
షాక్ కు గురైన సందీప్ కుటుంబ సభ్యులు పిల్లాడ్ని తీసుకొని ముత్తంగిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పటంతో సిటీలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లాడు గురువారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఓఆర్ ఆర్ మీద వెళుతున్న ఏదైనా వాహనం టైరు ఊడిపోయి.. వేగంగా దొర్లుకుంటూ రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేస్తున్న బాలుడ్ని ఢీ కొట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా విస్మయానికి గురవుతున్నారు. చావు రాసి పెట్టి ఉండాలే కానీ.. ఏదోలా ప్రాణాల్ని తీస్తుందన్న దానికి ఈ ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా వ్యాఖ్యానిస్తున్నారు.