క్రీమ్+బన్ = క్రీమ్-బన్... నిర్మలమ్మపై కామెంట్స్ వర్షంలో బిగ్ టర్న్!
ఈ సందర్భంగా అన్నపూర్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జీఎస్టీ విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిత్యం పలు కీలక ప్రశ్నలు ప్రజల నుంచి, వ్యాపారుల నుంచి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న కోయంబత్తూరులోని వ్యాపారులతో జరిగిన భేటీలోని ఓ వ్యవహారం మరింత వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది.
అవును... ఈ నెల 11న కోయంబత్తూరులోని వ్యాపారులతో నిర్మలా సీతారామన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్నపూర్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... బన్ పై జీఎస్టీ లేదని, క్రీమ్ పై 5% జీఎస్టీ ఉందని, కానీ క్రీమ్ బన్ పై మాత్రం జీఎస్టీ 18% ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇదే క్రమంలో... ఇలా బన్ పై జీఎస్టీ లేదు కానీ క్రీమ్ బన్ పై మాత్రం 18% జీఎస్టీ ఉండటంతో... తమకు క్రీమ్, బన్ సెపరేట్ గా ఇస్తే తామే బన్ పై క్రీమ్ రాసుకుని తింటామని కస్ట్ మర్లు చెబుతున్నారని అన్నారు. జీఎస్టీ గందరగోళంలో కంప్యూటర్లు కూడా సరిగా పనిచేయడం లేదని సెటైర్ వేశారు. అయితే దీనిపై స్పందించిన నిర్మళా సీతారామన్... శ్రీనివాసన్ చెప్పింది పరిశీలిస్తామని అన్నారు. ఈ సమయంలో... క్రీమ్+బన్ = క్రీమ్-బన్ అనే విషయం నెట్టింట వైరల్ గా మారింది!
ఈ క్రమంలో శ్రీనివాసన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైరల్ చేసింది డీఎంకే పార్టీ సోషల్ మీడియా! ఈ క్రమంలోనే నిర్మాలా సీతారామన్ నాయకత్వంలో జీఎస్టీ అతి పెద్ద సంక్లిష్ట సమస్యగా పరిణమించిందన్నట్లుగా పోస్టులు పెట్టింది. ఈ సమయంలో... నిర్మలా సీతారామన్ ను కలిసిన శ్రీనివాస్ ఈ మేరకు క్షమాపణలు చెప్పారని, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారంటూ ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది.
ఈ మేరకు తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ దీనికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పినట్లుగా రాసుకొచ్చింది! దీంతో... సీతారామన్ వ్యవహార శైలి ఇది అంటూ తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన శ్రీనివాసన్ తో క్షమాపణలు చెప్పించుకోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం అంటూ కామెంట్లు మొదలైపోయాయి.
ఇందులో భాగంగా... బహిరంగ వేదికలపై పదే పదే ఇలా చేయడం నిర్మలా సీతారామన్ కు అలవాటుగా మారింది అని ఖర్గే విమర్శించగా... ఓ చిన్న వ్యాపారి జీఎస్టీ విధానం గురించి మాట్లాడితే అహంకారంతో అగౌరవపరుస్తారు.. అదే కోటీశ్వరుడైన మిత్రుడు కోరితే చట్టాలనే మార్చేస్తారు.. జాతీయ సంపదను ఆ మిత్రుడికి కట్టబెడతారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఈ సమయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ ఐటీ వింగ్ తరుపున క్షమాపణలు చెప్పారు! ఓ గౌరవప్రదమైన వ్యాపారవేత్తకు, ఆర్థిక మంత్రికి జరిగిన ప్రైవేట్ సంభాషణలను వెలుగులోకి రావడంపై శ్రీనివాసన్ కు క్షమాపణలు చెప్పారు!! ఈ వ్యవహారంపై తాను శ్రీనివాసన్ తో మాట్లాడినట్లు తెలిపారు! ఏది ఏమైనా... ఈ వ్యవహారం మాత్రం పెను దుమారం రేపుతోంది!!