స్టూడెంట్స్ సూసైడ్స్... పీజీల్లో కొత్త రకం ఫ్యాన్లు!

అవును... వివిధ పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్ల కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని "కోటా"లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి.

Update: 2023-08-18 14:06 GMT

ఈ మధ్యకాలంలో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థులు.. ఎగ్జాంస్ లో క్వాలిఫై కాలేదని ఆత్మహత్యలను ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఇది అత్యంత విషాదకరమైన విషయం. దీంతో కోటాలోని స్థానిక యంత్రాంగం ఒక కొత్త ఆలోచన చేసింది.

అవును... వివిధ పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్ల కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని "కోటా"లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా... కోటాలోని అన్ని హాస్టళ్లు, పీజీ వసతుల్లో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్‌ కోటాలోని హాస్టల్స్, పీజీలను ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫ్యాన్‌ కు ఉరేసుకునే మరణించినట్లు గుర్తించిన అధికారులు.. హాస్టళ్లు, పీజీ గదుల్లో తక్షణమే వాటిని తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోడ్‌ ను గుర్తించిన క్షణంలోనే అన్‌ కాయిల్‌ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారుచేశారు.

కేవలం ఫ్యాన్లు మార్చడమే కాకుండా... విద్యార్థులపై డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, సెలవులు లేకపోవడంతో మానసికంగా వారిపై ఒత్తిడి నెలకొంటుందని భావించారు. దీంతో... కోచింగ్‌ సంస్థలు కచ్చితంగా విద్యార్థులకు వీక్లీ ఆఫ్‌ లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఇదే సమయంలో ఒక తరగతి గదిలో 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

కాగా.. ఐఐటీ, జేఈఈ, నీట్‌ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు "కోటా"కు వచ్చి శిక్షణ పొందుతుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. అయితే.. గత కొద్ది రోజులుగా ఇక్కడ తరచూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కోటాలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. మరోపక్క ఫ్యాన్లను మార్చడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చాల్సింది ఫ్యాన్లు కాదని, వారి ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

Tags:    

Similar News