తమిళనాడు బీజేపీలో అదే జరిగితే... అది ఇంతకంటే పెద్ద దెబ్బే!

అయితే... 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ మొదలైంది.;

Update: 2025-04-01 20:30 GMT
తమిళనాడు బీజేపీలో అదే జరిగితే... అది  ఇంతకంటే పెద్ద దెబ్బే!

తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై గురించి ఆ రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తమిళనాట బీజేపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన దూకుడు పార్టీకి ఓట్ల విషయంలో మేలు చేస్తే.. సీట్ల విషయంలో మాత్రం దెబ్బకొట్టిందని అంటారు. అందుకు కారణం 2024 లోక్ సభ ఎన్నికల నాటి పరిస్థితులు.

అయితే.. ఆ దెబ్బ నుంచి బీజేపీ ఇంకా కోలుకోలేదని అంటుంటారు. ఈ సమయంలో ఆ స్థాయిలో సీట్ల విషయంలో దెబ్బ తగలడానికి అన్నామాలై దూకుడే కారణం అని అంటారు. అయితే... వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇకపై ఆ తప్పు చేయవద్దని.. ఈ సమయంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ అధిష్టాణం భావిస్తోందని అంటున్నారు.

అవును... అన్నామాలై, తమిళనాడు బీజేపీలో తనదైన పాత్ర పోషించారు. ఇదే సమయంలో.. ప్రాంతీయ పార్టీల అధినేతలను మించి సొంత ఇమేజ్ లో మలుచుకున్నారని అంటారు. ఈ క్రమంలో.. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం (ఏఐఏడీఎంకే) తో బీజేపీ పొత్తు సెట్ కాకపోవడానికి ఆయనే కారణం అనేది మరోసారి రిపీట్ కాదని చెబుతున్నారు.

నాడు.. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే రాజీనామా చేస్తానని ఆయన బెదిరించారు. ఇదే సమయంలో.. అన్నాడీఎంకే ప్రముఖులు జయలలిత, సీఎన్ అన్నాదురైలపై తీవ్ర విమర్శలు చేశారు. ఫలితంగా.. అటు బీజేపీ, ఇటు అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేశాయి. ఇద్దరికీ దారుణమైన ఓటమి తప్పలేదు. బీజేపీకి ఒక్కసీటు గెలవలేదు. కాకపోతే.. 2019లో వచ్చిన 3.66% ఓట్ల సంఖ్య పెరిగి 10.72% పెరిగింది. ఇందులో అన్నామలై వాటా ఎక్కువగానే ఉందని అంటారు.

అయితే... 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ మొదలైంది. పైగా గతవారం అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా తో భేటీ కావడంతో ఈ పొత్తు చర్చలకు మరింత బలం చేకూరిందని అంటున్నారు.

వాస్తవానికి తమిళనాడులో ఇప్పటికే సవాలుతో కూడిన రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. వీటికి తోడు సూపర్ స్టార్ విజయ్ తన టీవీకే తో ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు విభిన్న వర్గాల ఓటర్లతో పాటు యువత నుంచి సరైన మద్దతు ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ సమయంలో... డీఎంకే, టీవీకే బలంగా ఉన్న వేళ ఒంటరి ప్రయాణం సేఫ్ కాదని బీజేపీ భావిస్తుందని అంటున్నారు.

పైగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - ఏఐఏడీఎంకే కలిసి సుమారు 36% ఓట్లను సాధించగా.. అధికార డీఎంకే 37.7% ఓట్లను సాధించాయి. కాంగ్రెస్, కమ్యునిస్టులు కలిస్తే ఆ నెంబర్ 45.38%కి పెరిగింది. ఈ సమయంలో... తమిళనాడు జనాభాలో సుమారు 8 నుంచి 10% ఓట్లతో తేవర్ కమ్యునిటీ మద్దతు కీలకంగా ఉంటుందని.. అందువల్ల ఆ కమ్యునిటీపై బీజేపీ దృష్టి సారించిందని చెబుతున్నారు.

అందువల్లే అన్నామలైను తమిళనాడు బీజేపీ చీఫ్ స్థానం నుంచి తప్పించి, అతని స్థానంలో తేవర్ కమ్యునిటీకి చెందిన నాయకుడిని నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం వల్ల అటు తేవార్ కమ్యునిటీ మద్దతు పొందే అవకాశంతో పాటు ఇటు అన్నాడీఎంకే నుంచి అన్నామలై విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి కూడా క్లియర్ చేసుకున్నట్లు అవుతుందనేది బీజేపీ పెద్దల ఆలోచన అని తెలుస్తోంది.

దీంతో... ఇదే జరిగితే.. డిసెంబర్ 2024లో అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక వేధింపులను నిరసిస్తూ అన్నామలై తనను తాను కొరడాలతో కొట్టుకున్నప్పుడు తగిలిన దెబ్బలకంటే.. ఇది చాలా పెద్ద దెబ్బే అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో.. అన్నామలై తెలివైన రాజకీయ నాయకుడని, పైగా ఆయనకు మోడీ, అమిత్ షా దీవెనలు మెండుగా ఉన్నాయని.. ఈ నిర్ణయాలు ఆయనకు దెబ్బేమీ కాదని మరికొంతమంది చెబుతున్నారు.

ఏది ఏమైనా... 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం అత్యంత ఆసక్తిగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే సమయంలో అటు ఇండియా కూటమిలో డీఎంకే ఉన్నట్లు, ఇటూ ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే మరోసారి జతకడితే.. విజయ్ కీలకంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి తమిళనాడులో త్రిముఖ పోటీ ఉంటుందా.. లేక, ద్విముఖ పోటీకే పొత్తులు సెట్ అవుతాయా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News