తెలంగాణలో తమిళ పార్టీ.. బరిలో ఉన్నవారెవరు?
తమిళనాడు కేంద్రంగా పని చేసే రాజకీయ పార్టీగా పేరున్న విడుతలై చిరుతైగల్ కట్చి.. పొట్టిగా చెప్పాలంటే "వీసీకే" బరిలోకి దిగింది.
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఒక తమిళ పార్టీ పోటీ చేయనుంది. తమిళనాడు కేంద్రంగా పని చేసే రాజకీయ పార్టీగా పేరున్న విడుతలై చిరుతైగల్ కట్చి.. పొట్టిగా చెప్పాలంటే "వీసీకే" బరిలోకి దిగింది. ఈ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు హైదరాబాద్.. సికింద్రాబాద్ లోక్ సభా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు.
హైదరాబాద్ ఎంపీ స్థానానికి జె. పద్మజ పోటీ చేస్తుంటే.. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పగిడిపల్లి శ్యామ్ లు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పద్మజ ముషీరాబాద్ నివాసి కాగా.. సికింద్రాబాద్ ఎంపీ బరిలో ఉన్న శ్యామ్ కుత్భుల్లాపూర్ లోని సూరారం కాలనీలో ఉంటున్నారు.
ఇంతకూ ఈ పార్టీ తమిళనాడులో ఉన్న బేస్ ఏమిటి? ఎవరి హక్కుల కోసం పోరాడుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
దళితుల హక్కుల కోసం దశాబ్దాలుగా వీసీకే పార్టీ పని చేస్తోంది. గతంలో ఈ పార్టీకి దళిత్ పాంథర్స్ ఇండియాగా పేరుంది. వీసీకే పార్టీ అధ్యక్షుడిగా తిరుమావలన్ వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ పార్టీ తమిళనాడులోని రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. తెలంగాణలో పోటీ చేస్తున్న తమిళ పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.