ఈవీఎంల ట్యాంపరింగ్...వైసీపీకే బూమరాంగ్ ?

ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ అనుకుంటే వైసీపీకి నాలుగు ఎంపీ సీట్లు ఎలా దక్కుతాయని ప్రశ్నిస్తున్నారు. అలాగే 11 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చేవి కావు కదా అని కూడా అంటున్నారు.

Update: 2024-06-22 01:30 GMT

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అన్న వాదన అర్ధ రహితం అనే అంతా అంటున్నారు. ఈ దేశంలో అనేక ఎన్నికల నుంచి ఈవీఎంలను వాడుతున్నారు. ఈవీఎంల ఫలితాలతో అధికారాలను దక్కించుకున్న వారే ఓడితే వాటి మీద నెపం నెట్టేస్తున్నారు. ఈవీఎంలను ప్రభావితం చేసే నెట్ వర్క్ లేదని వాటికి ఏ రకమైన ఇంటర్నెట్ యాక్సెస్ కానీ ఏ రకమైన రిసీవింగ్ టెక్నాలజీ కానీ లేదని చెబుతున్నా అదే వాదన చేస్తూ తమ ఓటమి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు.

ఏపీలో చూస్తే వైసీపీ అదే వాదన వినిపిస్తోంది. ఈవీఎంల వల్లనే ఓటమి పాలు అయ్యామని అధినేత జగన్ నుంచి అంతా అంటున్నారు జగన్ అయితే బ్యాలెట్ పేపరే బెటర్ అని ట్వీట్ కూడా చేశారు. మొత్తం మీద చూస్తే ఈవీఎంల టాంపరింగ్ మీద డిస్కషన్ జరుగుతున్నా జనాల్లో మాత్రం సరైన రెస్పాన్స్ లేదు. ఎందుకంటే వారు ఎవరికి ఓట్లు వేశారో తెలుసు కాబట్టి.

ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ అనుకుంటే వైసీపీకి నాలుగు ఎంపీ సీట్లు ఎలా దక్కుతాయని ప్రశ్నిస్తున్నారు. అలాగే 11 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చేవి కావు కదా అని కూడా అంటున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ లేదు అని చెప్పడానికి ఒక నిఖార్సు అయిన ఉదాహరణను ముందుకు తెస్తున్నారు.

అదేంటి అంటే తిరుపతి లోక్ సభ ఫలితం. అక్కడ టోటల్ గా పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీ ఓడింది. కూటమి అభ్యర్ధులే విజయం సాధించారు. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. ఆయన పదిహేను శాతం మెజారిటీతో విన్ అయ్యారు. మరి ఇదెలా సాధ్యమైంది అని అంటున్నారు.

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే ఈ సీటు వైసీపీకి కాకుండా కూటమికి ఇచ్చేవారు కదా అని అంటున్నారు. మరి ఇక్కడే ఫలితాలు కరెక్ట్ గానే వచ్చాయన్న సత్యం బోధపడుతోంది అని అంటున్నారు. అదే విధంగా వైసీపీ గెలిచిన మిగిలిన మూడు ఎంపీ సీట్లలోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలవలేదు అన్న సంగతిని గుర్తు చేస్తున్నారు.

అరకు ఎస్టీ రిజర్వ్డ్ లోక్ సభ సీటు చూస్తే అక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కేవలం రెండు చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. అయినా కూడా ఎంపీ సీటు వైసీపీ పరం అయింది. అలాగే కడప విషయం తీసుకుంటే అక్కడా ఎమ్మెల్యే సీట్లలో కూటమి అభ్యర్ధులే మెజారిటీ సాధించారు. కానీ ఎంపీ సీటు వైసీపీకి దక్కింది. ఇదే తీరున రాజంపేట లోక్ సభ సీటు కూడా ఉంది.

ఇలా చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నది ఒక అర్థరహితమైన వాదనగానే చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీలు కూటమి అభ్యర్ధులకు రావడానికి కారణం వారంతా కసిగా పనిచేశారని అంటున్నారు. అంతే కాదు జనసేన ఓట్ల శాతం ఈసారి కొన్ని జిల్లాలలో ఆరు నుంచి పదిహేను శాతం పైగా పెరిగింది అని గుర్తు చేస్తున్నారు. గోదావరి ఉత్తరాంధ్రాలలో అయితే అది ఏకంగా పద్దెనిమిది శాతంగా కూడా పెరిగింది అని అంటున్నారు.

అలా జనసేన ఓట్లు అన్నీ కూటమికి సజావుగా బదిలీ అయ్యాయి. టీడీపీ ఓటు బ్యాంకు గతసారి నలభై శాతం ఉంటే అది ఈసారి 45 శాతంగా పెరిగింది. బీజేపీ ఓటు బ్యాంక్ కూడా గతసారి వైసీపీకి మళ్ళిందని ఇపుడు వెనక్కి వచ్చిందని దాంతో కూటమి ఓట్లు అన్నీ కలిస్తేనే 56 శాతం పైగా ఓటు షేర్ వచ్చిందని దాని ఫలితమే భారీ మెజారిటీలు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అన్న దానిని వైసీపీ నేతలే నమ్మడం లేదు. అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయిన రాపాక వర ప్రసాదరావు అయితే ఈవీఎంల మీద నెపం నెట్టడం శుద్ధ తప్పు అని ఖండించారు. మూడు పార్టీలు కలిశాయి. భారీగా ఓట్లు వారికి పడ్డాయి. అందుచేతనే వైసీపీ ఓడింది అని ఆయన విశ్లేషించారు. మరి కళ్ల ముందు వివరాలు ఇలా ఉంటే ఈవీఎల మీద తప్పు చూపిస్తూ ఆత్మ వంచన చేసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News