షాప్ ఫ్లోర్ లో ఉద్యోగిగా ఎంట్రీ.. తిరుగులేని వ్యాపారశక్తిగా ఎగ్జిట్!

సాదాసీదా ఉద్యోగంతో కెరీర్ ను షురూ చేయటం చాలామందిలో కనిపిస్తుంది.

Update: 2024-10-10 04:52 GMT

గొప్పవాళ్లు ఎప్పుడూ ఆరంభంలోనే అత్యున్నత స్థానాల్ని అందిపుచ్చుకోరు. ఇటుక.. ఇటుక పేర్చుకుంటూ పోయినట్లుగా.. సాదాసీదా జీవితంతో మొదలుపెట్టి.. నిరంతర శ్రమతో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. టాటా కుటుంబంలో జన్మించినప్పటికీ.. ఉద్యోగం చేయాల్సి వచ్చిన వేళలో.. అత్యున్నత స్థానంలోనో.. సీనియర్ స్థానంలోనూ వెళ్లి కూర్చోలేదు. సాదాసీదా ఉద్యోగంతో కెరీర్ ను షురూ చేయటం చాలామందిలో కనిపిస్తుంది.రతన్ టాటా సైతం అదే పని చేశారు.

1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాం పూర్తి చేసి.. తన డిగ్రీ పూర్తి అయ్యాక 1962లో టాటా గ్రూప్ లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్ లో ఉద్యోగిగా పని చేశారు. కుటుంబ వ్యాపార మెళుకువల్ని తెలుసుకోవటంలో మునిగారు. అనంతరం ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో.. ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ (నెల్కో)కు డైరెక్టర్ ఇన్ ఛార్జిగా 1971లో బాధ్యతలు చేపట్టారు. కన్జుమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఆర్థిక మందగమనం.. కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదు.

ఇలాంటి వేళ 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్ కు బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినా.. మిగిలిన అధికారులు కలిసి రాకపోవటంతో సంస్థను మూసివేయాల్సి వచ్చింది. చివరకు 1991లో జేఆర్డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ ఛైర్మన్ గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలోొ ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. మిగిలిన అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ రతన్ టాటా వాటిని పట్టించుకోకుండా తన సత్తా నిరూపించుకున్నారు.

టాటా గ్రూప్ ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలోనే మేనేజ్ మెంట్ తీరు తెన్నులనూ పూర్తిగా మార్చేసి గ్రూప్ లోని కంపెనీలను పరుగులు తీయించారు. ఎన్నో సంస్కరణల్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన చేసిన కృషి అసమాన్యమైనది.

2000లో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన.. ప్రపంచంలోనే టీ కంపెనీల్లో అతిపెద్ద సంస్థగా రూపొందించటంలో కీలకభూమిక పోషించారు. 2007లో కోరస్ స్టీల్.. 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్.. ల్యాండ్ రోవర్ ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు. టాటా మోటార్స్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఇండికా కారును 1998లో రతన్ టాటా మార్కెట్ కు పరిచయం చేశారు. ఇది భారత వాహన రంగంలో సన్సేషనల్ గా మారింది. రూ.10వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన ఆయన 2012లో ఆయన టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.

తాను ఏరి కోరి మరీ తీసుకొచ్చిన సైరస్ మిస్త్రీ తీసుకున్న నిర్ణయాలతో ఆయన విభేదించారు. గ్రూప్ తీరుకు భిన్నంగా ఆయన తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలతో వారిద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో తిరిగి 2016 అక్టోబరు నుంచి 2017ఫిబ్రవరి వరకు మరోసారి ఛైర్మన్ గా బాధ్యతలుచేపట్టారు. ఆ తర్వాత ఎన్.చంద్రశేఖరన్ కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్ ఆదాయాలు 40రెట్లు.. లాభాలు 50 రెట్లు పెరగటం గమనార్హం. సాఫ్ట్ వేర్.. టెలికం.. ఫైనాన్స్.. రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన పదివేల కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవర్.. 2012లో ఆయన గ్రూప్ నుంచి తప్పుకునే సమయానికి 100 బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగింది. సాల్ట్ నుంచి సాఫ్ట్ వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది.

సంపాదించటమే కాదు తన సంపదను మిగిలిన వారికి ఇవ్వటంలోనూ రతన్ టాటా పెద్ద మనసున్న వ్యక్తి. తన సంపదలో 60-65 శాతం వరకు వివిధ ఎన్జీవోలకు విరాళంగా ఇచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇచ్చారు. వ్యక్తిగత హోదాలోనూ.. ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ద్వారా 30కు పైగా స్టార్టప్స్ లో పెట్టుబడి పెట్టారు. స్నాప్ డీల్.. షావోమీ.. ఓలా క్యాబ్స్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్ ఫెలోస్ అనే స్టార్టప్ కు తోడ్పాటును అందించారు. కరోనా నియంత్రణకు రూ.1500 కోట్ల అందించారు.

Tags:    

Similar News