నామినేటెడ్ పదవుల పందేరం... న్యాయం జరిగినట్లేనా?
అయితే కీలక పదవులు టీడీపీ తమ్ముళ్ళకే ఎక్కువగా దక్కాయని అంటున్నారు. అదే టైం లో జనసేనకు కూడా ప్రాముఖ్యత ఉన్న కార్పోరేషన్లు ఇచ్చారు.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండవ విడత నామినేటెడ్ పదవుల పందేరాన్ని వీకెండ్ లో చేపట్టింది. దాంతో చాలా మందిని హ్యాపీని నింపింది ఈ పదవుల పందేరం. ఏకంగా 59 కార్పోరేషన్ చైర్మన్ ల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో టీడీపీ 46 తీసుకుంటే జనసేనకు 10, బీజేపీకి మూడు పదవులు ఇచ్చారు.
గతంలో ఇరవై ఒక్క పోస్టులను తొలి విడతగా భర్తీ చేస్తే అందుకో టీడీపీకి 18 దక్కాయి. జనసేనకు మూడు లభించాయి. ఇందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టు కూడా ఉంది. అలాగే పాతిక మంది దాకా కార్యవర్గ సభ్యులను భర్తీ చేశారు.
ఇలా మొత్తం రెండు విడతలలో కలుపుకుని 80 దాకా కార్పోరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేశారు. ఇందులో టీడీపీకి 63 దక్కితే జనసేనకు 13, బీజేపీకి నాలుగు లభించాయి. ఈ మొత్తం పందేరంలో బీజేపీకి కొంత అన్యాయం జరిగింది అనే అంటున్నారు. జనసేనకు మాత్రం ఫరవాలేదు అన్నట్లుగానే పదవులు దక్కాయి.
అయితే కీలక పదవులు టీడీపీ తమ్ముళ్ళకే ఎక్కువగా దక్కాయని అంటున్నారు. అదే టైం లో జనసేనకు కూడా ప్రాముఖ్యత ఉన్న కార్పోరేషన్లు ఇచ్చారు. ఇక ఈ పదవుల పందేరంలో టీడీపీ విధేయతకే పెద్ద పీట వేసినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించినట్లుగా అర్ధం అవుతోంది.
ఈ నామినేటెడ్ పదవులలో వారి పనితీరుని కొలమానంగా తీసుకుని రేపటి రోజున వారికి మరిన్ని మంచి అవకాశాలు ఇవ్వడం కూడా చేస్తారని అంటున్నారు. తద్వారా టీడీపీలో యువతరానికి కొత్త తరానికి ఆస్కారం కల్పిస్తున్నారు అని అంటున్నారు.
ఇక పొత్తులలో భాగంగా జనసేన బీజేపీల కోసం తమ ఎమ్మెల్యే సీటుని కోల్పోయిన వారిని గుర్తు పెట్టుకుని మరీ టీడీపీ అధినాయకత్వం న్యాయం చేసింది అన్నది కచ్చితంగా కనిపిస్తోంది. అలా చూస్తే చాలా మందికి ఈ విధంగా అధినాయకత్వం అండగా ఉంటూ గట్టి భరోసా ఇచ్చినట్లు అయింది.
గతంలో అయితే నామినేటెడ్ పదవుల్ ఇన్నేసి భర్తీ చేసిన సందర్భం అయితే లేదు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కొన్ని పదవులు మాత్రమే భర్తీ చేశారు. దాంతో ఆ అసంతృప్తి కూడా క్యాడర్ లో ఉండి 2019 నాటికి పార్టీ ఓటమికి అది బలంగా పనిచేసింది అని విశ్లేషించిన వారు ఉన్నారు.
ఈసారి అలా కాకుండా అధికారంలోకి వస్తూనే నామినేటెడ్ పదవుల భర్తీకి తెర తీయడంతో పార్టీ కోసం కష్ట పడిన వారికి త్యాగం చేసిన వారికి వీలైనంత మేరకు న్యాయం జరిగింది అని అంటున్నారు. ఇక మరో నాలుగేళ్ల కాలం అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి మారో రెండు విడతలుగా ఈ నామినేటెడ్ పదవుల భర్తీ అన్నది జరుగుతుంది అని అంటున్నారు. సో ఆ విధంగా చూస్తే ఆశావహులకు ఇంకా మిగిలిపోయిన వారికి కూడా న్యాయం జరుగుతుంది అని అంటున్నారు.
ఇక చూస్తే ఏపీలో వందకు పైగా కార్పోరేషన్లు ఉన్నాయి. అంటే మూడవ విడతలో మరో ఇరవై దాకా పదవుల భర్తీ ఉంటుంది. ఆ విధంగా కూడా చాలా మందిని న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఈసారి తమ్ముళ్లకు బాగానే న్యాయం చేశారని పార్టీకి జీవకర్ర లాంటి క్యాడర్ కి కీలక పదవులు దక్కాయని అంటున్నారు.