తమ్ముళ్ల ఎంపికలో తర్జన భర్జన.. ఇదో బిగ్ సవాల్ ..!
మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఒకటికి పదిమార్లు ఎందుకు చెబుతున్నారు? అనేది కీలక అంశంగా మారింది.;

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌లు ఏ వేదిక ఎక్కినా నాయకులు, కార్యకర్తలను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఉగాది వేదికైనా.. పీ-4 సందర్భమైనా.. విశాఖలో నిర్వహించిన మరో కార్యక్రమంలో అయినా.. వరుసగా రెండు రోజుల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమ్ముళ్లను బుజ్జగించే పనిని చేపట్టారు. ఎవరినీ తక్కువ చేయబోమని.. అందరికీ అన్నీ లభిస్తాయని.. కాకుంటే కొంత ఓపిక పట్టాలని వారు చెబుతున్నారు. కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని కూడా పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.
మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఒకటికి పదిమార్లు ఎందుకు చెబుతున్నారు? అనేది కీలక అంశంగా మారింది. పార్టీ కూటమి కట్టి అధికారంలోకి వచ్చి 10 మాసాలు అవుతోంది. అయినప్పటికీ.. క్షేత్రస్తాయిలో అనేక మంది మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ నాయకులకు కూడా న్యాయం చేయలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. ఇది ప్రతిపక్ష నాయకులో టీడీపీ అంటే గిట్టనివారో చెబుతున్న మాట కాదు.. చేస్తున్న విమర్శకాదు. సొంత పార్టీ నాయకులే చాటు మాటుగా కాకుండా బహిరంగ విమర్శలు చేస్తు న్నారు. దీనికికారణం.. కొత్తగా వచ్చిన వారికి.. వైసీపీ ఉండి.. ఎన్నికలకుముందు జంప్ చేసి పదవులు ఇవ్వడమే.
మంత్రిపదవుల విషయాన్ని పక్కన పెడితే.. నామినేటెడ్ పదవుల విషయంలోనూ జంపింగు నాయకులకు జరుగుతున్న న్యా యం పార్టీని నమ్ముకుని ముందుకు సాగుతున్న వారికి జరగడం లేదన్నది పార్టీ నాయకులు చెబుతున్న మాట. తాజాగా జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల పందేరంలోనూ.. సింహభాగం వైసీపీ నుంచివచ్చిన వారికి.. లేదా.. ఇప్పుడున్న ఎమ్మెల్యే లు, ఎంపీలు సిఫారసు చేసిన వారు మెచ్చిన నాయకులకు మాత్రమే దక్కడం .. సిన్సియర్‌గా పార్టీకి సేవ చేసిన వారికి మాత్రం పదవులు దక్కకపోవడంతో ఇలాంటి ఆవేదన, ఆక్రందన ఎదురువతోంది.
ఇప్పటికిప్పుడు వీరివల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే.. దీర్ఘకాలంలో చూసుకుంటే..వైసీపీకి ఎదురైన అనుభవాలు తమ పార్టీకి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందన్న భావన టీడీపీ కీలక నాయకులలో వ్యక్తమవుతోంది. దీంతో వారిని ఏదో ఒకరకంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏవేదికెక్కినా.. ఎక్కడ మాట్లాడినా.. కష్టపడిన వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఇచ్చిన వారివైపు వేళ్లు చూపిస్తున్న ఇతర నాయకులు.. పార్టీకి అంతర్గత సవాళ్లు విసురుతున్నారు. మరి ఇకమీదట చేసే నియామకాలు.. ఎంపికల విషయంలో అయినా.. టీడీపీ అధినేత జాగ్రత్త పడతారో లేదో చూడాలి.