జర్నలిస్టులను వదలని టీడీపీ-జనసేన సోషల్ మీడియా!?
దీంతో ఆ పార్టీల సోషల్ మీడియా జనాలపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.
రాజకీయంగా ప్రత్యర్థులపై విమర్శలు చేయాలనే తాపత్రయంలో చాలామంది నేతలు, కొన్ని పార్టీల నాయకులు, వారి అనుచరులు, సోషల్ మీడియా జనాలు.. ఇంగితం మరిచిపోతుంటారనే కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ విషయంలో సంస్కారం మరిచిన కొంతమందికి.. ప్రభుత్వ అధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, మహిళలు అనే తారతమ్యాలేవీ లేకుండా పోతుంటుంది. తాజాగా అలాంటి ఘటనే తెరపైకి వచ్చింది.
అవును... ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలుగుదేశం, జనసేన పార్టీ.. వాటి అనుకూల సోషల్ మీడియా మరింత రెచ్చిపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు, అనుకూలమైన వ్యక్తులు ఒక మహిళా జర్నలిస్టును సైతం వ్యక్తిత్వ హననానికి పాల్పడే స్థాయికి దిగజారిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ పార్టీల సోషల్ మీడియా జనాలపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే... సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో టీవీ9 ప్రత్యేక ప్రోగ్రాం చేసింది. ఇందులో భాగంగా సీనియర్ కరస్పాండెంట్ హసీనా.. తన విధి నిర్వహణలో భాగంగా కొడాలి నాని బైక్ పై కొద్ది దూరం ప్రయాణించారు. దీంతో ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన దుష్ప్రచారం మొదలుపెట్టారు.
మహిళా జర్నలిస్టు అనే ఇంగితం కూడా లేకుండా ఆమెపై అసభ్యకరమై పోస్టులు పెట్టి పైశాచికానందం పొందుతున్నారు. దీంతో సంస్కారం కోల్పోయిన కొంతమంది సోషల్ మీడియా జనాలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్కారం మరిచిన వీరి పెంపకాలపై సైతం పలువురు కామెంట్ చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడో లేక మరో వ్యక్తితో ప్రోగ్రాం చేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా ఒక మహిళా జర్నలిస్టు బైక్ పై ఎక్కితే నీచమైన కామెంట్లు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో సంస్కారం మరిచిన, సభ్యత విడిచిన, కుసంస్కారులకు మరికొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రజానికం! ఇందులో భాగంగా... జర్నలిస్టు అంటే సామాన్యుడి దగ్గర్నించి సెలబ్రిటీ వరకు అందరితో సందర్భాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు.. అంతమాత్రాన ఇలా నీచమైన ట్రోలింగ్ కు దిగుతారా? అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతవరకూ సహేతుకమో సంస్కారులు ఆలోచించాలని హితవు పలుకుతున్నారు.
ఈ క్రమంలో ఒక మహిళా జర్నలిస్టు అనే సంగతి సైతం మర్చిపోయిన మూర్ఖపు జనం కొంతమంది ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా? పండగపూట ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధి బైక్ పై ప్రయాణిస్తే... దాన్ని కూడా వక్రీకరించి, ఆమెను మోరల్ గా దెబ్బతీసేయాలని ప్రయత్నం చేయడం అసలు భావ్యమేనా? ఇది సంస్కారులు చేసే పనేనా?
జర్నలిజంలో మహిళల సంఖ్య తగ్గుతుందనే చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి అసభ్యకరమైన, దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం? హసీనా స్థానంలో సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారి తల్లో, చెల్లో, భార్యో, బంధువో ఉంటే ఇలాగే చేస్తారా? అని ఘాటుగా ప్రశ్నిస్తుంది మహిళా లోకం!! ఈ సమయంలో... కాస్త ఇంగితంతో ఆలోచిస్తే ఇలాంటి పనులకు పూనుకోరని.. అలాంటి ఆలోచనలు కూడా చేయరని అంటున్నారు. ఈ ప్రశ్నలు, విమర్శల్లో... ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా? అనేది చివరి మాట!!