తమ్ముళ్లలో రగులుతున్నకసి.. పొత్తు మైనస్ పక్కానట!

కీలకమైన ఎన్నికల్లో గెలుపు అనివార్యంగా మారిన ప్రత్యేక పరిస్థితుల్లో వరంగా మారాల్సిన మిత్రులు శాపమవుతున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

Update: 2024-02-24 04:26 GMT

బలం కాస్తా బలహీనత అయితే? వరం శాపం అవుతుందా? అధికారాన్ని అందించాల్సిన పొత్తు అవమానకర ఓటమికి అవకాశంగా మారితే.. అందకు మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది? ఇప్పుడు టీడీపీ అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుగు తమ్ముళ్లలో కసి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాము ఎంతగానో అభిమానించే అధినేత మీద విమర్శలు ఎక్కు పెట్టే దిశగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారు.

దీనికి కారణం పొత్తు లెక్కలే అంటున్నారు. కీలకమైన ఎన్నికల్లో గెలుపు అనివార్యంగా మారిన ప్రత్యేక పరిస్థితుల్లో వరంగా మారాల్సిన మిత్రులు శాపమవుతున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. సీట్ల పంచాయితీ కొలిక్కి రాకపోవటం.. ఎన్నికలు ఓవైపు ముంచుకొస్తుండటం.. అధికార పార్టీ తన అభ్యర్థుల లెక్కల్ని తేల్చేస్తూ.. వారిని వారియర్స్ మాదిరి మార్చేస్తుంటే.. తమ సీటు ఎప్పుడు ఏమవుతుందన్న ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు మునిగిపోయారంటున్నారు.

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా టికెట్ల లెక్కల్ని తేల్చే విషయంలో చంద్రబాబు చేసే జాగు అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు జాబితా విడుదలలో అందరికంటే ముందే ఉంటామని మాటల్లో చెప్పటమే కానీ ఏ రోజూ చేతల్లో చూపించింది లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితే మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పాలి. జనసేన..బీజేపీపొత్తుల నేపథ్యంలో మిత్రులకు ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై క్లారిటీ రాలేదనే చెప్పాలి. ఓవైపు జనసేనతో సీట్ల లెక్కలు కొలిక్కి రాలేదు. మరోవైపు బీజేపీ గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

దీంతో.. తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ తీవ్రమవుతుందంటున్నారు. కోటి ఆశలతో టికెట్ కోసం ఎదురుచూస్తున్న తమ్ముళ్లు.. రేపొద్దున పొత్తు లెక్కల్లో బాగంగా సీటు త్యాగం చేయాల్సి వస్తే ఎలా రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్న. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. సీట్ల త్యాగం వరకు వచ్చేసరికి మాత్రం తమ్ముళ్ల మైండ్ సెట్ మారిపోతుందంటున్నారు. ఇప్పుడు మిత్రుడి కోసం తలవంచితే తమ రాజకీయ భవిష్యత్తుకు పుల్ స్టాప్ పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే తెలుగుదేశానికి పెద్ద మైనస్ గా చెప్పాలి.

తమకు దక్కాల్సిన అవకాశాన్ని పొత్తు పేరుతో గద్దలా తన్నుకు పోయే మిత్రుల విషయంలో తెలుగు తమ్ముళ్ల మైండ్ సెట్ ఏమిటన్నది ప్రశ్న. తమకు దక్కని అవకాశం మరెవరికీ దక్కుతుందంటే.. వారికి పూర్తిగా సహకరించేంత సీన్ తమ్ముళ్లలో లేదంటున్నారు. అదే ఖాయమైతే.. పొత్తు లెక్కలు మైనస్ లోకి వెళ్లటం ఖాయమంటున్నారు. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉన్న ఎందరో తమ్ముళ్లకు సీట్ల షాక్ ఖాయమంటున్నారు. అలాంటి వేళ.. వారి రియాక్షన్ ఏమిటన్నదే అసలు ప్రశ్న. అదే చంద్రబాబు ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుందంటున్నారు.

Tags:    

Similar News