తీన్మార్ మల్లన్న ఘన విజయం.. మెజారిటీ ఎంతంటే!
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్లగొండ.. జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో విస్తరించిన ఈ ఎమ్మెల్సీ స్థానం అందరికీ ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన చింతపండు నవీన్.. ఉరఫ్ తీన్మార్ మల్లన్న ఘన విజయం దక్కించుకున్నారు. దాదాపు 22 వేల ఓట్ల మెజారిటీ ఆయన దక్కించుకున్నారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ.. పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి మే 27న ఎన్నిక జరిగింది. మొత్తంగా 4.63 లక్షల మంది పట్ట భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 5వ తేదీన ప్రారంభమై.. రెండురోజుల పాటు సాగింది.
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్లగొండ.. జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో విస్తరించిన ఈ ఎమ్మెల్సీ స్థానం అందరికీ ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నడూ లేని విధంగా ఫైర్ బ్రాండ్ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) రంగంలో ఉండడంతో ఈ ఉప పోరు హాట్ హాట్‌గా సాగింది. బీఆర్ ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి విజయం దక్కించుకోవడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఇప్పుడు ఉప పోరు జరిగింది. అయితే.. సార్వత్రిక ఎన్నికల సమరానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఉప ఎన్నిక జరగడం గమనార్హం. భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు చేతులు కూడా తడిపారని వార్తలు వచ్చాయి. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలోఉన్నారు. వీరిలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ మద్దతు ఉన్న ఇద్దరు అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, బీఆర్ ఎస్ తరఫున రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నా.. బలమైన పోటీ ఇచ్చే విషయంలో మాత్రం తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డిల మధ్యే పోరు సాగింది.
ఇక, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చీరావడంతోనే నిరుద్యోగులను ఆకట్టుకుంది. అదేవిధంగా యువతను కూడా ఆకర్షించింది. దీంతో వారంతా తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వైపు నిలిచారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ గ్రాడ్యుయే ట్ మండలి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌కు 33 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకు న్నారు. అలాగే.. మల్లన్నకు సీపీఐ, సీపీఎంల నుంచి కూడా మద్దతు లభించింది. అయినప్పటికీ ఎన్నిక లపోరు మాత్రం తీవ్ర ఉత్కంఠగా మారింది.
ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకే ఎక్కువ సమయం పటి్టంది. వీటినే మూడు రౌండ్లలో లెక్కించారు. మొత్తం 2,64,216 ఓట్లను అర్హమైనవిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,06,234 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి 87,356 ఓట్లు, బీజేపీకి 34,516 ఓట్లు వచ్చాయి. మొత్తానికి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ప్రకటించారు. అయితే.. సాంకేతిక విజయం తీన్మార్ మల్లన్నదే అయినా.. నైతిక విజయం తనదేనని బీఆర్ ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.