ఏం తమాషాలు చేస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

అధికారికంగా ఆమోదించకుండానే వివరాలను ఎలా బయటపెడతారు? ఎవరు బయట పెట్టారంటూ సీఎం ఎడాపెడా వాయించేసినట్లు చెబుతున్నారు.

Update: 2025-02-03 12:33 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. మంత్రివర్గంలో చర్చించకుండానే కుల గణన నివేదికలు మీడియాలో ప్రత్యక్ష కావడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. అధికారికంగా ఆమోదించకుండానే వివరాలను ఎలా బయటపెడతారు? ఎవరు బయట పెట్టారంటూ సీఎం ఎడాపెడా వాయించేసినట్లు చెబుతున్నారు.

కుల గణన నివేదికపై తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ నివేదికను ఆమోదించాలని భావించారు. అయితే ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారులు, మంత్రులు ముందుగానే మీడియాకు లీకులిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేదని ప్రజలు భావించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రులు.. కొద్దిసేపట్లో మాట్లాడతారనగా, సీఎం సీరియస్ అయ్యారనే సమాచారంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు చెబుతున్నారు.

కాగా, తెలంగాణలో చేపట్టిన కుల గణనలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో సగానికి పైగా బీసీల సంఖ్యే ఎక్కువగా ఉంది. జనాభాలో సుమారు 56.33 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారేనని ప్రభుత్వ లెక్కల్లో బయటపడింది. వాస్తవంగా బీసీల జనాభా 46.25 శాతం ఉండగా, మైనార్టీ బీసీ జనాభాను కలిపితే మొత్తం జనాభా 56.33 శాతానికి చేరింది.

ఇక రాష్ట్రంలో అగ్రవర్ణాల జనాభా 15.79 శాతంగా ఉంది. ముస్లిం మైనార్టీలు 12.56 శాతం ఉంది. ముస్లిం మైనార్టీల్లో ఓసీలు 2.48 శాతంగా నమోదైంది. అదేవిధంగా ఎస్టీలు 10.45 శాతం, ఎస్సీలు 17.43 శాతం ఉన్నారని తేలింది. ఇందులో ఆయా సామాజిక వర్గాల ఉప కులాల లెక్కలను నమోదు చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పురస్కరించుకుని ఈ లెక్కలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News