ఒకవైపు మోడీ.. మరోవైపు కేసీఆర్.. నాణేల పంపకం.. ఎక్కడంటే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ ఎస్-బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్-బీజేపీలు ఒక్కటేనని బీఆర్ ఎస్ అగ్రనాయకులు ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్-బీఆర్ ఎస్-ఎంఐఎంలు ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేస్తోంది.
మొత్తంగా ఈ మూడు పార్టీలు(బీఆర్ ఎస్-బీజేపీ-కాంగ్రెస్) చేస్తున్న ప్రచారంలో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా చెప్పలేనంతగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అగ్రనాయకులే ఈ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు మరింతగా దూకుడు పెంచారు. తాజాగాకాంగ్రెస్ అభ్యర్థి ఒకరు బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్కటేనని పేర్కొంటూ.. తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. దీనిని ఎన్నికల వరకు ప్రజలు గుర్తుంచుకుంటారోలేదోనని భావించిన ఆయన.. ఓ చిత్రమైన ఆలోచన చేశారు.
ఒక వైపు ప్రదాని మోడీ, మరోవైపు సీఎం కేసీఆర్ బొమ్మలతో కూడిన నాణేలను తయారు చేయించారు. వీటిని ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని.. వీటిలో ఏ పార్టీకి ఓటేసినా.. తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఆయన ప్రచారం చేస్తున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి.. బల్మూరు వెంకట్ ఈ నాణేలను పంపిణీ చేయడం గమనార్హం.
బీజేపీ-బీఆర్ ఎస్ ల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని.. ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో దేనికి ఓటేసినా.. తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుతుందని వెంకట్ చెబుతున్నారు. ఓటుతో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే నాణేలను పంపిణీ చేశారు. అయితే.. దీనిపై బీజేపీ, బీఆర్ ఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా నాణేలను పంపిణీ చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని.. ఈసీకి ఫిర్యాదు చేస్తామని అంటున్నాయి.