ఆయన కాదు ఆమె.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సంథింగ్ స్పెషల్
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటైనప్పుడు ఎవరికీ ప్రత్యేక రాష్ట్రం సాధ్యం అవుతుందనే ఆశల్లేవ్
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పాటైనప్పుడు ఎవరికీ ప్రత్యేక రాష్ట్రం సాధ్యం అవుతుందనే ఆశల్లేవ్.. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైనప్పడు కూడా చాలామంది.. ఇది కలనా? నిజమా? అన్నట్లు చూశారు. ఇప్పుడు తెలంగాణ పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. అయితే, ఇన్నేళ్లలో చూడని అరుదైన సీన్ వచ్చే జూన్ 2న కనిపించనుంది.
ఆమె పట్టుదలతోనే..
ఎవరెన్ని చెప్పినా ప్రత్యేక తెలంగాణ సాకారం వెనుక ఉన్న వ్యక్తి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు, ఆపై కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (సీఎంపీ)లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన అందరికీ తెలిసిందే. అయితే, బలమైన శక్తులు, వ్యక్తులు, పరిస్థితుల కారణంగా తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైంది. కానీ, 2009 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ ఇవాల్సిందేనంటూ సోనియా నిర్ణయించుకోవడంతో అందుకు కార్యాచరణ సిద్ధమైపోయింది. కాగా, అప్పటికీ చాలామంది ప్రభావవంతమైన వ్యక్తులు తెలంగాణను వ్యతిరేకించారు. సోనియా పట్టుదల ముందు ఇవేవీ నిలవలేదు. అయితే, 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2018లోనూ హస్తం పార్టీకి విజయం దక్కలేదు. దీంతో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు అధికారికంగా జరిపినా సోనియాకు పాల్గొనే అవకాశం లేకపోయింది.
ఈ సారి వస్తారా..?
ప్రత్యేక రాష్ట్రాన్ని పదేళ్లు సాగదీసిన కాంగ్రెస్ కు ప్రజలు పదేళ్ల తర్వాత అధికారం అప్పగించి తమ ప్రత్యేకత ఏమిటో చాటిచెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలంటూ కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఢిల్లీ వెళ్లి ఆమెకు లేఖ అందించారు. కాగా, సోనియా గనుక తెలంగాణ ఆవిర్భావ వేడుకలక వస్తే అది పెద్ద విషయమే అవుతుంది. అనారోగ్యంతో చాలా అరుదుగా మాత్రమే ఆమె బయటకు వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికలకూ దూరమై.. రాజ్య సభకు వెళ్లారు. ఈ ఎన్నికల్లోనూ ప్రచారం చేయడం లేదు. ఈ నేపథ్యంలో సోనియా తెలంగాణకు వస్తారా? అనేది చూడాలి.
కొసమెరుపు: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర సాధన స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సీఎంగా పదేళ్లు ఆయన ఆధ్వర్యంలోనే ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ప్రతిపక్షంలోకి వెళ్లిపోయారు. ఇక తెలంగాణ సాకారం చేసిన వ్యక్తి సోనియాగాంధీ. ఇప్పుడు కేసీఆర్ వేడుకలకు దూరం కాగా.. సోనియా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.