లోకేష్ వైపు బిగ్ సౌండ్...పవన్ సైడ్ సైలెంట్ !

అదేంటో తెలియదు కానీ ఏపీలో ఒక యువ నాయకుడి ప్రాధాన్యత అంతకంతకు పెరిగిపోతోంది.;

Update: 2025-04-03 05:30 GMT
లోకేష్ వైపు బిగ్ సౌండ్...పవన్ సైడ్ సైలెంట్ !

అదేంటో తెలియదు కానీ ఏపీలో ఒక యువ నాయకుడి ప్రాధాన్యత అంతకంతకు పెరిగిపోతోంది. ఆయనే నారా లోకేష్. ఎపుడైతే యువగళం అంటూ లోకేష్ మొదలెట్టారో నాటి నుంచే ఆయన రాజకీయ ప్రాభవం మొదలైంది. అది అలా అధికమవుతోంది. 2024లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రధాన ఆకర్షణగా ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా లోకేష్ కనిపిస్తున్నారు.

ఆయన రాజకీయ రాజసం ఒక్క లెక్కలో లేదు. ఆయన దూకుడు అలాగే ఉంది. ఏపీలో సీఎం గా చంద్రబాబు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నారు. కానీ లోకేష్ పొలిటికల్ ఇమేజ్ చూస్తే వేరే లెవెల్ లో ఉంది అని అంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సీఎం స్థాయిలోనే మర్యాదలు గౌరవం దక్కుతున్నాయి. దానికి తగినట్లుగా లోకేష్ మంత్రిగా కేవలం తన శాఖల గురించి మాట్లాడటం లేదు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతున్నారు. విధాన నిర్ణయాల మీద మాట్లాడుతున్నారు.

ఇక వచ్చే కాలమంతా లోకేష్ బాబుదే అని ఎరిగిన తమ్ముళ్ళు ఊరకే ఉంటారా. వారు అపుడే బిగ్ సౌండ్ చేస్తున్నారు. కాబోయే సీఎం లోకేష్ అని నినదిస్తున్నారు. రాజకీయాల్లో ముందు చూపు ఉండాలి. అలా ఉన్న వారంతా ముందే లోకేష్ బాబు టీం లో చేరాలనో లేక ఆయన దృష్టిలో పడాలనో రేపటి సీఎం లోకేష్ అని నిబ్బరంగా అనేస్తున్నారు

దాంతో లోకేష్ చుట్టూ బలమైన రాజకీయ బంధం అల్లుకుంటోంది. నిన్నటికి నిన్న ప్రకాశం జిల్లాలో అదే జరిగింది. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అయితే ఉత్సాహం ఆపుకోలేక మా సీఎం లోకేష్ బాబే అనేశారు. లోకేష్ ని అలా అంటే బాబుకు సంతోషమే. తండ్రిగా ఆయనకు కావాల్సింది అదే. కానీ మిత్రపక్షంగా ఉన్న జనసేనతోనే రాజకీయ సంకటం ఉంది.

ఎందుకంటే జనసేన అధినేత పవన్ బాబు పదిహేనేళ్ళు సీఎం గా ఉండాలని అంటున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం 2029 నాటికి సీఎం లోకేష్ అని ఫిక్స్ అయిపోయారు వారు అందుకే ధైర్యంగా ఈ స్లోగన్స్ ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ లోకేష్ పొలిటికల్ ఇమేజ్ ఈ స్థాయిలో వెలిగిపోతూంటే మిగిలిన వారి సంగతి ఏమిటి అన్న చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ సైతం పబ్లిక్ మీటింగ్స్ కి వెళ్తున్నారు. ఆయన వెళ్ళినపుడు ఫ్యాన్స్ కానీ జనసైనికులు కానీ ఓజీ ఓజీ అని స్లొగన్స్ ఇస్తున్నారు. గతంలో అయితే సీఎం అని అనేవారు. మరి ఎందుకో పవర్ స్టార్ గానే ఆయన్ని ఊహించుకుని కొత్త సినిమాల పేర్లే చెబుతున్నారా అన్నది ఆలోచిస్తున్నారు. వీటి కంటే ముందు చూస్తే కనుక పవన్ తాను స్వయగా బాబే ఆరోసారి కూడా సీఎం అని ప్రమోట్ చేస్తూ పోతున్నారు.

దాంతో పవన్ కి ఆ ఆసక్తి లేదేమో అన్నది కూడా జనంలోకి వెళ్తోంది. ఇక లోకేష్ పట్టుదల ఆయన లక్ష్యాలు ఆయన దూకుడు, ఆయన ఉన్న బలమైన తెలుగుదేశం పార్టీ ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న వారు ఆయనకేంటి సీఎం మెటీరియల్ అనేస్తున్నారు దాంతో కాబోయే సీఎం గా లోకేష్ ఎలివేట్ అవుతున్నారు. ఏపీలో సీఎం కావాలని కోరుకుంటున్నది విపక్షంలో వైసీపీ. కానీ ఎన్నికలు పెట్టాలి. వైసీపీ గెలవాలి. దాంతో కాబోయే సీఎం జగన్ అన్నది వైసీపీలో సన్న సన్నగా వినిపిస్తోంది. ఎందుకంటే కేవలం 11 సీట్లతో వైసీపీ బాగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ఇలా అన్ని వైపులా చూసుకుంటే లోకేష్ బాబు వైపే బిగ్ సౌండ్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎపుడూ సానుకూలత ఉండాలి. పరిస్థితులు అలా డ్రైవ్ చేయాలి. జనంలో ఇవే నానుతూ ఒక జడ్జిమెంట్ కి ఆస్కారం కల్పిస్తాయి. అలా చూస్తే కనుక లోకేష్ కి మెల్లగా జనాల్లో యాక్సెప్టెన్స్ కి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఆ విధంగా చూస్తే ఏపీలో బాబు తరువాత ఎవరు అంటే లోకేష్ అన్నది ఠక్కున వచ్చే జవాబుగా ఉంది. దీనికి తగిన రాజకీయ వ్యూహాలు టీడీపీ వద్ద ఉంటే జనసేన అధినాయకత్వం మాత్రం ఇంకా ఒక అయోమయంలో ఉంది. రాష్ట్రం అభివృద్ధి అంటూ చెబుతున్న మాటల వల్లనే ఆ వైపు కొంత సైలెంట్ అయినట్లుగా సీన్ కనిపిస్తోంది అన్నది ఒక విశ్లేషణ.

Tags:    

Similar News