అంతా ఊడ్చేశారు.. దొంగలను పట్టుకునే సీబీఐ ఆఫీసునే దోచేశారు

సీబీఐ కార్యాలయంలో జరిగిన ఈ చోరీ ఎప్పుడు జరిగిందో స్పష్టత కొరవడింది. కారణం.. ఈ కార్యాలయం ఐదు నెలలుగా మూసి ఉండడమేనట.

Update: 2025-02-14 12:48 GMT

దేశంలో ఎక్కడ ఘరానా మోసాలు జరిగినా... ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నా.. అందరూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అనే అంటారు. మరి అలాంటి సీబీఐనే దోచేశారు.. అది కూడా నిలువునా ఊడ్చేశారు.. ఈ ఘరానా దోపిడీని కూడా సీబీఐ కొన్ని నెలల తర్వాత గుర్తించడం గమనార్హం.

సీబీఐనే దోచేసిన ఘటన ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడం కూడా ఆశ్చర్యకరం. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత కట్టుదిట్టమైన ష్యామలీ బజార్ క్వార్టర్ కాంప్లెక్స్‌ లో ఉంది సీబీఐ ఆఫీసు. దీంట్లోనే చోరీ జరిగింది. అది ఎంతగా అంటే కుర్చీలు, డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్ సామగ్రి అన్నీ దోచేసేంత. చివరగా చూస్తే కార్యాలయంలో గోడలు తప్ప ఏమీ లేవట.

మూసివేసిన ఆఫీసులో..

సీబీఐ కార్యాలయంలో జరిగిన ఈ చోరీ ఎప్పుడు జరిగిందో స్పష్టత కొరవడింది. కారణం.. ఈ కార్యాలయం ఐదు నెలలుగా మూసి ఉండడమేనట. అయితే, ఇటీవల అధికారులు బ్రాంచ్‌ కు వెళ్లడంతో చోరీ విషయం బయటపడింది.

పోలీసులకు సీబీఐ ఫిర్యాదు ఘరానా చోరీపై సీబీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. త్రిపుర రాజధాని అగర్తలా సమీపంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొంత సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా వస్తువులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం చోరీనేనా? దీనివెనక వేరే ఏదైనా కారణం ఉందా..? అని సీబీఐ తనదైన శైలిలో విచారణ సాగిస్తోంది.

Tags:    

Similar News