'మహా బుల్' స్టాక్ మార్కెట్లు.. ఆ పార్టీదే గెలుపని తేలడంతోనే
దీనికిముందు శనివారం సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడడం.. అందులో అధికార ఎన్‌డీయే దే విజయమని తేలడంతో మార్కెట్ సూచీల రేసుకు ప్రధాన కారణంగా మారింది.
సెలవు అనంతరం సోమవారం మొదలైన స్టాక్ మార్కెట్లు మహా జోష్ మీద పరుగెడుతున్నాయి. దీనికిముందు శనివారం సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడడం.. అందులో అధికార ఎన్‌డీయే దే విజయమని తేలడంతో మార్కెట్ సూచీల రేసుకు ప్రధాన కారణంగా మారింది. సోమవారం ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. అదే హవా మధ్యాహ్నం వరకు సాగింది. మదుపర్ల సంపద రూ.12.50 లక్షల కోట్లు పెరిగింది. దీంతోపాటు సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను తాకాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని పాజిటివిటీ, రేట్ల కోత అంచనాలతో ఆసియా మార్కెట్ల ర్యాలీ, రూపాయి బలపడడం కూడా భారత సూచీలకు శుభసూచకమైంది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,738 దగ్గర, నిఫ్టీ 23,338 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. సెన్సెక్స్-30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్ మినహా అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. పవర్ గ్రిడ్ 10 శాతానికి పైగా లాభపడడం విశేషం. మధ్యాహ్నం ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ 8 శాతం, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ 6 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం 5 శాతంపైగా లాభంలో కొనసాగుతున్నాయి. కాగా.. 12:32 గంటల వరకు సెన్సెక్స్ 2,335 పాయింట్లు ఎగబాకి 76,286 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 694 పాయింట్లు పెరిగి 23,225 వద్ద ట్రేడవుతోంది.
ఇది ఊహించినదే..
ఎన్డీఏదే మళ్లీ అధికారమని శనివారం సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి. అయితే, సెలవు కావడంతో అప్పటికి మార్కెట్ లేదు. సోమవారం ఈ అంచనాలు సూచీల్లో జోష్ నింపాయి. దీనికితగ్గట్లే సెన్సెక్స్ 2వేల పాయింట్లపైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. నిఫ్టీ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలూ కలిసిరావడం, రూపాయి బలపడడం, బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు రాణించడం మరింత ఊపునిచ్చింది. ఉదయం 9:23 సమయంలో సెన్సెక్స్ 1,808 పాయింట్ల లాభంతో 75,769 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 దగ్గరకు వచ్చింది. దీనికిముందు సెన్సెక్స్ 76,738.89 దగ్గర, నిఫ్టీ 23,338.70 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేశాయి.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద మొదలైంది. అమెరికా మార్కెట్లు గత వారం లాభాలతో ముగిశాయి. రేట్ల కోత ఆశలతో సోమవారం ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా రాణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 81.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు గతవారం మార్కెట్ చివరి రోజైన శుక్రవారం నికరంగా రూ.1,614 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.2,115 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.