1988 లోనే చెప్పాడు.. ఇప్పుడు ట్రంప్ చేసి చూపించాడు.. వైరల్ వీడియో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన టారిఫ్‌ల నేపథ్యంలో ఆయన దశాబ్దాల నాటి టీవీ ఇంటర్వ్యూ ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది.;

Update: 2025-04-04 08:30 GMT
1988 లోనే చెప్పాడు.. ఇప్పుడు ట్రంప్ చేసి చూపించాడు.. వైరల్ వీడియో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన టారిఫ్‌ల నేపథ్యంలో ఆయన దశాబ్దాల నాటి టీవీ ఇంటర్వ్యూ ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది. 1988లో 'ది ఓప్రా విన్‌ఫ్రే షో'లో ట్రంప్ పాల్గొన్న ఈ క్లిప్‌లో, అమెరికా వాణిజ్య విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. జపాన్, కువైట్ వంటి మిత్రదేశాలు కూడా తమ "న్యాయమైన వాటా" చెల్లించకుండా అమెరికా ఆర్థిక శక్తిని ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

-జపాన్ వాణిజ్య విధానాలపై 1988లోనే ట్రంప్ హెచ్చరిక

ఓప్రా విన్‌ఫ్రే షోలో మాట్లాడుతూ జపాన్ అమెరికా మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయమైన పోటీ కారణంగా అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు."వాళ్లు మన కంపెనీలను నాశనం చేస్తున్నారు" అని జపాన్ వాణిజ్య విధానాలను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. అవకాశం వస్తే మిత్రదేశాలు మరింతగా సహకరించేలా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

"శత్రువుల గురించి వదిలేయండి. శత్రువులతో మనం అంత సులభంగా మాట్లాడలేం - కానీ మన మిత్రదేశాలు మాత్రం తమ న్యాయమైన వాటా చెల్లించేలా చేస్తాను. మనం రుణగ్రస్త దేశంగా మారాం. రాబోయే కొన్నేళ్లలో ఈ దేశానికి ఏదో జరగబోతోంది. ఎందుకంటే మీరు రెండు వందల బిలియన్ డాలర్లు నష్టపోతూ ఉండలేరు. అయినా జపాన్‌ను మన మార్కెట్లలోకి వచ్చి తమ ఉత్పత్తులన్నింటినీ డంప్ చేయడానికి అనుమతిస్తున్నాం. ఇది స్వేచ్ఛా వాణిజ్యం కాదు" అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, జపాన్ చాలా క్లోజ్డ్ మార్కెట్ అని.., అక్కడ అమెరికన్ కంపెనీలకు పోటీ పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ట్రంప్ అభివర్ణించారు. "మీరు ఇప్పుడే జపాన్‌కు వెళ్లి ఏదైనా అమ్మడానికి ప్రయత్నిస్తే, దాని గురించి మర్చిపోండి. అది దాదాపు అసాధ్యం. అక్కడ దానికి వ్యతిరేకంగా చట్టాలు లేవు, కానీ వాళ్లు దానిని అసాధ్యం చేస్తారు. వాళ్లు ఇక్కడికి వచ్చి తమ కార్లు, వీసీఆర్‌లు అమ్ముకుంటున్నారు, మన కంపెనీలను నాశనం చేస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

- కువైట్, మధ్యప్రాచ్య వాణిజ్యంపై విమర్శలు

ట్రంప్ మధ్యప్రాచ్యంపై కూడా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కువైట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా సైనిక, ఆర్థిక సహాయం పొందుతున్నప్పటికీ ఆ దేశం తిరిగి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. "కువైట్‌లో పేదవాడు కూడా రాజులా జీవిస్తున్నాడు. అయినా వాళ్లు చెల్లించడం లేదు. వాళ్లు తమ చమురును విక్రయించడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. వాళ్లు సంపాదిస్తున్న దానిలో ఇరవై ఐదు శాతం మనకు ఎందుకు చెల్లించడం లేదు? ఇది ఒక జోక్" అని ఆయన అన్నారు.

- ట్రంప్ కొత్త టారిఫ్‌ల నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఓప్రా ఇంటర్వ్యూ

ట్రంప్ కొత్తగా టారిఫ్‌లు అమలు చేస్తున్న తరుణంలో ఈ పాత క్లిప్ మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తాజాగా చాలా వస్తువులపై 10% దిగుమతి పన్నును విధించారు. అమెరికాతో ఎక్కువ వాణిజ్య మిగులు ఉన్న దేశాలు మరింత ఎక్కువ జరిమానాలు ఎదుర్కొంటున్నాయి. అయితే, కెనడా , మెక్సికోలకు ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం మినహాయింపు లభించింది.

ఈ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడంతో ట్రంప్ యొక్క దీర్ఘకాలిక వాణిజ్య విధానాలపై చర్చ జరుగుతోంది. 1988లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు.. నేడు ఆయన తీసుకుంటున్న చర్యలకు ఎలా దారితీశాయోనని చాలా మంది విశ్లేషిస్తున్నారు. 1988లోనే ట్రంప్ చెప్పాడు.. ఇప్పుడు అమలు చేస్తున్నాడని అంటున్నారు.

Tags:    

Similar News