ఒక్క లేఖ .. 54 మందికి దర్శనం
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు చేసిన ఒక లేఖపై 54 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతుంది.
తిరుమలలో దర్శనానికి సామాన్యులు పడే కష్టాలు మామూలుగా ఉండవు. వీఐపీల సిఫారసు లేఖ తీసుకెళ్లినా 6 లేదా 7 మందికి మించి దర్శనం ఇవ్వరు. వైసీపీ హయాంలో తిరుమల దర్శనాల మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు చేసిన ఒక లేఖపై 54 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతుంది.
పెద్దిరెడ్డి పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫారుసు లేఖను తాజాగా తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను నాశనం చేయాలని చూసిందని, తిరుమలలో వైసీపీ పెద్దలు యథేచ్ఛగా దందాలు చేశారని ఆరోపించింది.
నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని పంపించాలని రాసిన సిఫారసు లేఖ ఇదేనని పేర్కొంది. ఈ బ్రేక్ దర్శనం స్కాంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించినట్టు వెల్లడించింది. అయితే ప్రతి నెలా మాజీ మంత్రి రోజా కొందరిని ఎంపిక చేసిన వారిని తనతో పాటు దర్శనానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పెద్దిరెడ్డి లేఖ బయటకు రావడంతో ఇంకెన్ని దారుణాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాలి.