పొంగులేటి 3 దరఖాస్తులు.. తుమ్మల దరఖాస్తే చేయలే.. పాలేరు ఎవరికో?

తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం రాజకీయాలే వేరు. అందులోనూ అక్కడి కాంగ్రెస్ రాజకీయాలు ఎవరికీ అంతుపట్టవు.

Update: 2023-09-24 10:02 GMT

తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం రాజకీయాలే వేరు. అందులోనూ అక్కడి కాంగ్రెస్ రాజకీయాలు ఎవరికీ అంతుపట్టవు. తాజా పరిణామాలే చూస్తే.. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి ఉమ్మడి ఖమ్మంలో అభ్యర్థుల ఖరారు పెద్ద పనిగా మారింది. అందులోనూ ఒక నియోజకవర్గంలో అభ్యర్థిత్వం సమస్యగా అవతరించింది.

పాలేరుకు పెద్దన్న ఎవరో?

రాజకీయంగా చైతన్యవంతమైన ఉమ్మడి ఖమ్మంలో ఉన్నవి మూడే జనరల్ నియోజకవర్గాలు. మిగతా ఏడు రిజర్వుడ్. ఈ మూడు జనరల్ నియోజకవర్గాల్లో పాలేరు, ఖమ్మం పక్కపక్కనే ఉంటాయి. ఇటీవలి పరిణామాల్లో పాలేరు నియోజకవర్గం పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడమే దీనికి కారణం.

ఇద్దరి కన్నూ పాలేరు మీదనే

తమ్మల, పొంగులేటి ఇద్దరి కన్నూ పాలేరు మీదనే ఉందని తెలుస్తోంది. తుమ్మల 2018లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి స్థాయిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కేలేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కందాళ ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చారు. రాజకీయంగా తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంలో.. పాలేరు నుంచి పోటీ చేసేందుకే ఆయన పార్టీ మారారు.

నాడు పాలేరు చిచ్చే

2018 ఎన్నికల వరకు తుమ్మల, పొంగులేటి ఇద్దరూ బీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగారు. అయితే, ఆ ఎన్నికల్లో తుమ్మల ఓటమికి వర్గ రాజకీయాలే కారణమని ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మంలో కేవలం ఒక్క సీటే గెలవడంతో అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. పొంగులేటికి 2019 లోక్ సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది.

ఎవరికి దక్కుతుందో?

ఔత్సాహిక అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 1006 దరఖాస్తులు రాగా.. వాటిని వడపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా విషయం ఎటూ తేలడం లేదు. కాగా, పొంగులేటి.. కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు మూడు స్థానాలకూ దరఖాస్తు చేశారు. ఆయన స్థాయి రీత్యా ఎక్కడినుంచైనా టికెట్ దక్కొచ్చు. అయితే, ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ లో చేరిన తుమ్మల మాత్రం ఒక్కచోటకూ దరఖాస్తు చేయలేదు. ఆయన చేరేటప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోయింది. దీంతో అవకాశం లేకపోయింది.

కొసమెరుపు: తుమ్మల మినహా పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి 15 దరఖాస్తులు వెళ్లాయి. అయితే, తుమ్మలకు టికెట్ తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి. ఆయనను ఖమ్మం నుంచి పోటీ చేయమన్నప్పటికీ ఒప్పుకోవడం లేదని తెలిసింది. వాస్తవానికి పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి కూడా పాలేరు నుంచి పోటీకి ఉత్సాహం చూపారు. పొంగులేటి కూడా దరఖాస్తు చేశారు. మరిప్పుడు ఎవరికి దక్కుతుందో చూడాలి.

Tags:    

Similar News