తగ్గేదే లే.. మరోసారి ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు!

ఇంకోవైపు సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు గానూ అయోధ్య స్వామీజీ ఒకరు ఆయనపై మండిపడ్డ సంగతి తెలిసిందే

Update: 2023-09-07 05:44 GMT

సనాతన ధర్మం.. డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని.. దాన్ని నియంత్రించడం కాదని నిర్మూలించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే ప్రభుత్వంలో మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ సహా పలువురు బీజేపీ నేతలు, హిందూ సంఘాలు, పీఠాధిపతులు తీవ్రంగా ఖండించారు.

మరోవైపు డీఎంకేతో కలిసి ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌) తదితర పార్టీలు ఉదయనిధి వ్యాఖ్యలను తాము సమర్థించబోమని స్పష్టం చేశాయి. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వెల్లడించాయి.

ఇంకోవైపు సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు గానూ అయోధ్య స్వామీజీ ఒకరు ఆయనపై మండిపడ్డ సంగతి తెలిసిందే. ఉదయనిధి తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ లో పలువురు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి.

తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేస్తున్నప్పటికీ ఉదయనిధి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. తనపై కేసులు పెట్టుకున్నా భయపడబోనని వెల్లడించారు. ఉదయనిధి తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సైతం తన కుమారుడి వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. తన కుమారుడు మాట్లాడిన మాటల్లో ఏ తప్పూ లేదన్నారు.

ఈ నేపథ్యంలో మరోసారి ఉదయనిధి స్టాలిన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై తగ్గేదే లేదని తేల్చిచెప్పారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. వందేళ్లుగా సనాతన ధర్మం నిర్మూలనపై తమ పార్టీ డీఎంకే మాట్లాడుతోందని గుర్తు చేశారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం కులవివక్షకు సరైన ఉదాహరణ ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సనాతన ధర్మంలోని కులవివక్షకు మాత్రమే తాను వ్యతిరేకమని స్పష్టతనిచ్చారు.

కాగా ఉదయనిధి తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తానని ప్రకటించిన ఉత్తరప్రదేశ్‌ స్వామీజీపై తమిళనాడులో కేసు నమోదైంది. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News