ఉండవల్లి.. జగన్ గురించి అంత మాటనేశాడేంటి?

ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అని జగన్ అనడం అత్యంత హాస్యాస్పదమైన విషయమని ఉండవల్లి అన్నారు.;

Update: 2025-04-02 15:21 GMT
ఉండవల్లి.. జగన్ గురించి అంత మాటనేశాడేంటి?

ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్, ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా లేకపోవచ్చు కానీ.. ఆయన రాజకీయ విశ్లేషణలను ఇప్పటికీ అందరూ ఆసక్తిగా గమనిస్తారు. చాలా లాజికల్‌గా మాట్లాడుతూ.. రాజకీయాల గురించి ఆసక్తికర విశ్లేషణలు చేస్తుంటారు ఉండవల్లి. ఆయన ప్రస్తుతం తటస్థ నాయకుడిగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు పట్ల వ్యతిరేకత, జగన్ పట్ల కొంత సానుకూలత ఉందనే అభిప్రాయాలే ఎక్కువమందిలో ఉన్నాయి.

అలాంటి నేత జగన్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లను అంటూ భీష్మించుకుని కూర్చున్న జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. అవినీతి కేసుల్లో ఆయనకు శిక్ష పడి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా అనర్హత వేటును ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు ఉండవల్లి చెప్పడం గమనార్హం.

ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అని జగన్ అనడం అత్యంత హాస్యాస్పదమైన విషయమని ఉండవల్లి అన్నారు. ఆ హోదా ఉన్నా సరే గత ఐదేళ్లు చంద్రబాబుకు సరిపడా సమయం అసెంబ్లీలో ఇచ్చారా అని జగన్‌ను ఉండవల్లి ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, జగన్.. వీళ్లందరూ కూడా అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన వారే అని.. కానీ అసెంబ్లీకి వెళ్లి తమకేదో అన్యాయం జరిగిందనో, అవమానం జరిగిందనో కారణం చెప్పి అసెంబ్లీకి బయటికి వచ్చారని.. అలా చేస్తే అర్థం ఉందని.. కానీ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి తమకు సమయం ఇవ్వరని చెప్పి అసెంబ్లీకి వెళ్లకపోవడం తెలివి తక్కువ నిర్ణయమని ఉండవల్లి అన్నారు.

ఇక జగన్ మీద ఉన్నవి సామాన్యమైన కేసులు కావని.. చంద్రబాబు రాబోయే కొన్నేళ్లలో కచ్చితంగా ఈ కేసుల విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, కోర్టుల్లో పిటిషన్లు వేసి.. జగన్‌కు ఓ రెండేళ్లయినా శిక్ష పడేలా చేస్తారని ఉండవల్లి అన్నారు. జగన్ పై కోర్టులో అప్పీల్ చేసి బెయిల్ అయితే తెచ్చుకుంటారని.. కానీ శిక్ష పడడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు మాత్రం పడుతుందని ఆయన తేల్చేశారు.

Tags:    

Similar News