పవన్ తొందరతో ఏపీలో రెండు పార్టీలే...ఉండవల్లి సెన్షేషనల్ కామెంట్స్ !

ఏపీ రాజకీయాల్లో దశాబ్దాలుగా రెండు పార్టీల వ్యవస్థ కొనసాగుతోంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ప్రాంతీయ పార్టీ టీడీపీ మూడు దశాబ్దాల పాటు పోరు చేసింది.

Update: 2023-10-15 10:27 GMT

ఏపీ రాజకీయాల్లో దశాబ్దాలుగా రెండు పార్టీల వ్యవస్థ కొనసాగుతోంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ప్రాంతీయ పార్టీ టీడీపీ మూడు దశాబ్దాల పాటు పోరు చేసింది. ఆ తరువాత కాంగ్రెస్ పోయి వైసీపీ వచ్చింది. అది కూడా బలమైన ప్రాంతీయ పార్టీ కావడంతో ఈ రెండు పార్టీల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఏపీ అంతా ఈ రెండు పార్టీలుగా చీలిపోయి ఉన్న రాజకీయ వాతావరణం ఉంది.

ఈ నేపధ్యంలో మూడవ పార్టీ ఏదైనా వస్తే ఆదరించేందుకు జనాలు కూడా సుముఖంగా ఉన్నారు. అయితే మూడవ పార్టీగా వచ్చిన జనసేన ఇపుడు తన తొందరపాటు తో వ్యూహాల లేమితో చేజేతులా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంది అన్న భావన అయితే అంతటా ఉంది. అంతే కాదు జనసేనలోనూ ఉంది. పొత్తులు పెట్టుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే ఆ పొత్తుల వెనక ఎత్తులు ఉండాలి.

అవి తమకు లాభించేలా ఉండాలి. ఇపుడు పవన్ అలా కాకుండా తొందరపాటు ప్రదర్శించారు. టీడీపీతో పొత్తు ప్రకటన తానుగా చేసి ఇరుకున పడ్డారు. ఇదే మేధావులతో పాటు విశ్లేషకులలో కూడా ఉంది. అయితే దీని మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన విశ్లేషణ చేశారు. పవన్ పొత్తుల విషయంలో తొందర పడ్డారని అన్నారు. తనతో చెప్పి ఉంటే కొన్నాళ్ళు ఆగమని సలహా ఇచ్చేవాడిని అని అన్నారు.

పవన్ తో ఉండవల్లికి సాన్నిహిత్యం ఉంది. ఆయన గత ఎన్నికల ముందు ఉండవల్లిని పిలిచి ఏపీకి విభజన వల్ల జరిగిన నష్టాలు ఏపీకి ఏమి కావాలి అన్న దాని మీద మాట్లాడారు. ఉండవల్లికి అంతటికి విలువ ఇచ్చినందుకే ఆయన కూడా పవన్ మీద ఎపుడూ పల్లెత్తు మాటని విమర్శించారు. పవన్ ఏపీలో మూడవ శక్తిగా ఎదుగుతారని ఉండవల్లి కూడా తరచూ అభిప్రాయపడేవారు.

అయితే పవన్ మాత్రం జెట్ స్పీడ్ తో పొత్తులను టీడీపీతో పొత్తులను కుదిర్చేసుకున్నారు. దాంతో ఇపుడు ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ కూడా వచ్చింది. టీడీపీకే ఈ పొత్తుల వల్ల లాభం అని ఉండవల్లి అంటున్నారు. పవన్ చేసిన ఈ పని వల్ల ఏపీలో అయితే వైసీపీ లేకపోతే టీడీపీ అన్నట్లుగా పరిస్థితులు మారాయని ఉండవల్లి అన్నారు.

మరో వైపు చూస్తే స్కిల్ స్కాం లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండడం వెనక ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఏ ఆధారం లేకుండా కోర్టులు రిమాండ్ విధించవని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఇక స్కిల్ స్కాం కేసులో కొన్ని ఫైల్స్ మాయం అయ్యాయని అది వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా లేక టీడీపీ ప్రభుత్వంలో జరిగిందా అన్నది తేలాల్సి ఉందని అన్నారు.

చంద్రబాబు తన కేసు విషయంలో బెయిల్ కి వెళ్లకుండా కేసు కొట్టేయమని కోరడం వింతగా ఉందని ఉండవల్లి అంటున్నారు. ఏ కేసు అయినా బెయిల్ కోసం ప్రయత్నం చేసుకోవాలని కానీ ఇది అలా కాకుండా మొత్తం కేసే కొట్టేయమంటే ఎందుకు అలా జరుగుతుందని ఉండవల్లి ప్రశ్నించారు.

చంద్రబాబు కనుక బెయిల్ కోసం పెట్టుకుంటే ఏ సమస్య ఉండేది కాదని ఆయన అంటున్నారు. అంటే కచ్చితంగా బెయిల్ వచ్చేదని ఉండవల్లి భావనగా ఉంది అంటున్నారు. అదే విధంగా ఉండవల్లి మరికొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లాలని వైసీపీ నేతలు ఎందుకు కోరుకుంటారని అన్నారు.

ఒక వేళ బాబు వల్ల ఎవరైనా జైలుకు వెళ్తే మాత్రం వారే ఆ కోపంతో ఆయన జైలు జీవితం గురించి కోరుకుంటారని అన్నారు. మరి ఆ విధంగా వైసీపీలో ఎవరున్నారా అన్న చర్చకు ఉండవల్లి తెలివిగానే తెర తీశారని అంటున్నారు. పేరు చెప్పకుండా ఆయూన వైసీపీ పెద్దల మీదనే పరోక్ష విమర్శలు చేశారని అంటున్నారు. మరో వైపు ఉండవల్లి ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు కేసు అని అంటున్నారు.

అదే విధంగా జైలుకు వెళ్ళిన వారు ఎవరూ రాజకీయంగా నష్టపోలేదని బయటకు వచ్చి గెలిచిన ఉదంతాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయని అన్నారు. అందువల్ల ఈ కేసులో ఊరికే ఆదుర్దా పడకుండా కూల్ గా ఉండాలని అన్నారు. చంద్రబాబుకు స్కిల్ స్కాం లో డబ్బులు ముట్టాయని ఆధారాలు లేకపోయినా ఆయన పీయే ఖాతాలోకి డబ్బులు వెళ్ళాయని మాత్రం ఆధారాలు ఉన్నాయని అన్నారు. మొత్తానికి చంద్రబాబు మెడకు ఈ కేసు ఎలా చుట్టుకుంటుందో ఉండవల్లి చక్కగానే వివరించారు.

Tags:    

Similar News