వీడియో : సూసైడ్ బాంబులతో ఐసిస్ టాప్ లీడర్.. రాకెట్ తో హతమార్చిన అమెరికా
ఇప్పుడు మాత్రం పైచేయి సాధించింది అనే చెప్పాలి.;
శరీరం చుట్టూ ఆత్మాహుతి బాంబులు.. కారులో అత్యంత భద్రత నడుమ ప్రయాణం.. కానీ, అమెరికా టార్గెట్ పెడితే ఇవేవీ అడ్డుకోలేవు కదా..? ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) టాప్ లీడర్ విషయంలో ఇదే జరిగింది. ఐసిస్ ను కూకటి వేళ్లతో పెకిలించేందుకు అమెరికా ఎన్నాళ్ల నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఎంతకూ విజయవంతం కాలేకపోతోంది. ఇప్పుడు మాత్రం పైచేయి సాధించింది అనే చెప్పాలి. ఇంతకూ ఏం జరిగిందంటే..?
ఐసిస్ పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ భద్రతా దళం సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది. కొన్నేళ్లుగా కీలక మిలిటరీ ఆపరేషన్లూ చేపట్టింది. 2017లో ఇరాక్, 2019లో సిరియాలో ఈ సంస్థను చాలావరకు నిర్వీర్యం చేసింది. కానీ ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఐసిస్ గ్రూప్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఇవి ఎప్పటికైనా ముప్పేనని అమెరికా భావిస్తోంది. శత్రువును సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా దాడి చేసింది.
ఇరాక్ గడ్డపై..
తాజాగా ఐసిస్ అంతర్జాతీయ వ్యవహారాల చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అమెరికా క్షిపణి దాడిలో హతమార్చింది. దీనికి ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సాయం తీసుకుంది. ఇదంతా ఈ నెల 13న జరిగింది. కానీ, రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, ఖదీజాను హతమార్చింది ఎక్కడో తెలుసా? ఇరాక్ లో కావడం గమనార్హం.
ఖదీజా.. ఐసిస్ పెద్ద నాయకుడు కావడంతో అతడికి పటిష్ఠ భద్రత ఉంది. అంతేకాదు.. శరీరానికి సూసైడ్ బాంబులు అమర్చుకుని, ఆయుధాలతో ప్రయాణిస్తున్నాడు. పైగా కచ్చితంగా ఖదీజా అని నిర్ధారించుకోలేని పరిస్థితి. దీనికి డీఎన్ఏ సాయం పొందా. గతంలో ఖదీజాపై దాడి జరగ్గా త్రుటిలో తప్పించుకున్నాడు. దీంతో అప్పట్లో అతడి డీఎన్‌ఏ నమూనాను సేకరించారు. తాజాగా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఖదీజాను హతమార్చినట్లు ధ్రువీకరించారు.
ఖదీజా హతమైన విషయాన్ని ఇరాక్ ప్రధాని మొదట ప్రకటించారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిజమేనని తేల్చారు. ఖదీజాది దుర్భర జీవితం అని.. దానిని తాము ముగించామని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో వెల్లడించారు.
ఖదీజా ఐసిస్ లో రెండో అత్యంత శక్తిమంతమైన నాయకుడు. అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల్లో ఒకడు.