లైఫ్ లో జనసేనకు 40 శాతం ఓటు షేర్ వస్తుందా...వైసీపీ శ్రేణులు !

అంతవరకూ ఓకే అనుకున్నా జనసేన 11 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఈ రోజుకీ కూడా మొత్తం ఏపీలోని 175 సీట్లకు పోటీ చేయలేదని ఒంటరిగా బరిలోకి దిగలేదని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.;

Update: 2025-03-15 09:30 GMT

జనసేన పొత్తుల ఎత్తులతో గెలిచింది. నిజమే రాజకీయాల్లో ఇవన్నీ కూడా ముఖ్యమే. ఎలా గెలిచేమన్నది కాదు. గెలుపే అన్ని విషయాలూ మాట్లాడుతుంది. అంతవరకూ ఓకే అనుకున్నా జనసేన 11 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఈ రోజుకీ కూడా మొత్తం ఏపీలోని 175 సీట్లకు పోటీ చేయలేదని ఒంటరిగా బరిలోకి దిగలేదని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.

ఇక జనసేన ఓటు షేర్ ఎపుడూ ఆరేడు శాతం మించి లేదని కూడా అంటున్నారు. జనసేన ఆవిర్భావ సభ పెట్టి తమ పార్టీ గురించి చెప్పుకోకుండా 11 సీట్లు వైసీపీకి వచ్చాయంటూ విమర్శలు చేయడాన్ని వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. వైసీపీకి ఈ రోజుకీ 40 శాతం ఓటు షేర్ ఉందన్న విషయం గమనించాలని గుర్తు చేస్తున్నాయి.

ఈ ఓటు షేర్ జనసేనకు తన రాజకీయ జీవిత కాలంలో ఎపుడైనా దక్కుతుందా అని కూడా ప్రశ్నిస్తున్నాయి. జనసేన మీటింగ్ కాదు కానీ వాట్సప్ గ్రూపులలో వైసీపీ శ్రేణులు పవన్ ని జనసేనను గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి.

జనసేన 11 ఏళ్ళ ప్రస్థానాన్ని తమదైన శైలిలో విమర్శిస్తున్నాయి. క్యాడర్ లీడర్ లేరని 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదని గుర్తు చేస్తున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలసి పోటీ చేసినా 134 సీట్లకు మించి అభ్యర్థులను పెట్టలేకపోయారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇక అందులోనూ గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటు అని పేర్కొన్నాయి. పవన్ అయితే పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలు అయిన చేదు నిజాన్ని కూడా గుర్తుకు తెచ్చి కెలుకుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేనకు వచ్చింది ఆరు శాతం ఓటు షేర్ మాత్రమే అని సెటైర్లు వేస్తున్నాయి.

ఇక్స్ 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక టీడీపీ బీజేపీతో పొత్తు కట్టిన జనసేన వైసీపీని విమర్శించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. అదే వైసీపీ విషయం తీసుకుంటే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే 40 శాతం ఓటు షేరింగ్తో పాటు 67 సీట్లు దక్కాయని గుర్తు చేస్తున్నాయి.

అలాగే 2019 ఎన్నికల్లో చూస్తే కనుక 50 శాతం ఓటు షేర్ 151 సీట్లు వైసీపీకి ఒంటరిగానే వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో సీట్ల పరంగా 11 మాత్రమే దక్కినా ఓటు షేర్ 40 శాతం వచ్చిన సంగతిని మరచిపోతున్నారా అని వైసీపీ శ్రేణులు జనసేనను గట్టిగానే తగులుకుంటున్నాయి.

ఇలా మూడు ఎన్నికలు చూస్తే ఎక్కడా 40 శాతం ఓటు షేర్ అయితే వైసీపీకి తగ్గలేదు అది కూడా ఒంటరిగానే జగన్ బరిలోకి దిగి సవాల్ చేసి తన సత్తా చూపారని అంటున్నాయి. మరి జనసేన ఇదే 40 శాతం ఓటు షేర్ సాధించడానికి ఎంత కాలం పడుతుందో పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి.

ఏకంగా జీవిత కాలమంతా చూసినా జనసేనకు 40 శాతం ఓటు షేర్ వస్తుందా అని పవన్ నే ప్రశ్నిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే పవన్ జీవిత కాలంలో ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన కూడా కనీసంగా చేయగలరా అని సవాల్ చేస్తున్నాయి. మరో మూడు ఎన్నికల వరకూ కూటమిగానే ఉండాలని పవన్ పదే పదే అంటున్నారు అంటేనే ఒంటరిగా పోటీకి ఆ పార్టీకి ఇబ్బంది అన్నది అర్థం కావడం లేదా అని అంటున్నారు.

పొత్తులతో గెలిచిన పార్టీలు కూడా వైసీపీని జగన్ ని విమర్శలు చేయడమేంటని అంటున్నాయి. ఏపీ రాజకీయాలో వైసీపీ ఈ రోజుకీ బలమైన పార్టీగా ఉందని ఆ పార్టీకి కొన్ని వర్గాలలో స్థిరమైన ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు. అంతే కాదు వైసీపీ సిద్ధాంత బలం కూడా గట్టిదని చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే జనసేన ఆవిర్భావ సభలో పవన్ సహా ఆ పార్టీ నుంచి మాట్లాడిన వారంతా వైసీపీని విమర్శిస్తే దానికి వైసీపీ శ్రేణులు గట్టిగానే సోషల్ మీడియాలో కౌంటర్ చేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా సమరం ఎపుడు ఆగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News