ట్రంప్ కు వ్యతిరేకంగా పోస్టులు... నలుగురిని చంపి ఆత్మహత్య!
ఈ నేపథ్యంలో రెండు ఇళ్లలోనూ మొత్తం ఐదుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉన్నారని అధికారులు తెలిపారు.
రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పెట్టే సోషల్ మీడియా పోస్టులు, తదనంతర పరిణామాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో... ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ట్రంప్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వ్యక్తి... తన భార్య, మాజీ భాగస్వామి, ఇద్దరు కుమారులను కాల్చి, ఆత్మహత్య చేసుకున్నాడు.
అవును... అమెరికాలోని మెన్నెసోటా రాష్ట్రంలో ఆంథోని నెఫ్యూ (46) అనే వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునే ముందు తన భార్య, మాజీ భాగస్వామితో పాటు ఇద్దరు కుమారులను కాల్చి చంపాడు. ఇతడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు వ్యతిరేకంగా తరచు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రెండు ఇళ్లలోనూ మొత్తం ఐదుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉన్నారని అధికారులు తెలిపారు. ఒక ఇంట్లో.. ఆంథోనీ మాజీ భాగస్వామి ఎరిన్ అబ్రామ్సన్, వారి కుమారుడు జాకబ్ నెఫ్యూ మరణించి ఉండగా.. దానికి సమీపంలోని ఇంట్లో అతని భార్య కాథరిన్ నెఫ్యూ, కుమారుడు ఆలివర్ నెఫ్యూ తో పాటు ఆంథోనీ మృతదేహాన్ని కనుగొన్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో అతడు మానసిక ఆరోగ్య సమస్యల నమూనాను ఎదుర్కొన్నాడని డులుత్ పోలీస్ చీఫ్ మైకొ సెనోవా తెలిపారు! ఈ సందర్భంగా... తన మానసిక ఆరోగ్యం, ప్రపంచం ఇకపై శాంతియుతంగా సహజీవనం చేయలేవని అతడు జూలైలో పెట్టిన పోస్టులో పేర్కొన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... రిపబ్లికన్లు మహిళలు విడిచిపెట్టడాన్ని కష్టతరం చేస్తున్నారని నెఫ్యూ ఆరోపించారు.
ఆంథోనీ మరో పోస్టులో... బరక్ ఒబామా, జో బైడెన్, కమలా హారిస్ లతో పాటు ట్రంప్ ఫోటోలు ఉన్నాయని.. అయితే ట్రంప్ ఫోటోపై "హేట్" అని రాసి ఉండగా... డెమోక్రాట్ల ఫోటోల కింద "హోప్", "క్యూర్", "డెవలప్ మెంట్" అని రాసి ఉందని అంటున్నారు. అయితే... అతని హత్యలకు, ఆత్మహత్యకు ట్రంప్ గెలుపే కారణమా.. లేక, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారని తెలుస్తోంది.