వంశీ టు జగన్.. కిడ్నాప్ కేసులో సంచలనం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయిన కిడ్నాప్ కేసులో పెను సంచలన విషయాలు వెలుగుచూడనున్నాయా? ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారా? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోందంటున్నారు.

Update: 2025-02-27 05:52 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయిన కిడ్నాప్ కేసులో పెను సంచలన విషయాలు వెలుగుచూడనున్నాయా? ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారా? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోందంటున్నారు. వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు కేసులో వంశీ చుట్టూ ఉచ్చు బిగించేలా పలు టెక్నాలజీ ఆధారాలు చూపినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా బాధితుడు సత్యవర్థన్ కిడ్నాప్ తర్వాత వంశీ హైదరాబాద్ నుంచి తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వచ్చిన విషయమై ప్రశ్నించినట్లు చెబుతున్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా వంశీ తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఉన్న తేదీ, సమయం వంటి అన్ని ఆధారాలు చూపడంతో ఆయన షాక్ అయినట్లు చెబుతున్నారు.

వంశీ అరెస్టు తర్వాత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ టెక్నికల్ సర్వేలైన్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అన్న విషయాన్ని చెప్పారు. అంటే అరెస్టు సమయానికే వంశీకి వ్యతిరేకంగా పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లు భావిస్తున్నారు. వంశీ అరెస్టు సందర్భంగా డీజీపీ చెప్పిన విషయంపై ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, విచారణలో వంశీని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడించేందుకు టెక్నాలజీ ఆధారాలను పోలీసులు బయట పెడుతుండటంతో పెద్ద చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ విషయంలో సత్యమేవ జయతే అంటూ వైసీపీ విడుదల చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా పోలీసుల వాదనను బలపరిచేవిధంగా ఉన్నాయంటున్నారు. వంశీ అమాయకుడు అంటూ వైసీపీ కొన్ని ఆధారాలు విడుదల చేస్తున్నా, అవి పోలీసులకు తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా అడుగులు వేస్తున్నారంటున్నారు. కోర్టులో ఎవరి వాదన నెగ్గుతుందో కానీ, ప్రస్తుతానికి వంశీ చుట్టూ ఉచ్చు బిగించడానికి టెక్నాలజీపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు పోలీసులు.

ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి వంశీ వెళ్లాడనే విషయాన్ని పోలీసులు ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఈ కేసుకి వైసీపీ అధినేతకు ఎలాంటి లింకు లేకపోయినా, విచారణలో ఆయన పేరు ప్రస్తావించారనే ప్రచారం, పైగా తాడేపల్లికి వంశీ వచ్చాడంటూ గూగుల్ టేకౌట్ ను చూపించడం విస్తృత చర్చకు దారితీస్తోంది. కిడ్నాప్ కేసుపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తో వంశీ ముందుగానే చర్చించారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సత్యవర్థన్ ను విజయవాడ నుంచి హైదరాబాద్ కు తిరిగి అక్కడి నుంచి వైజాగ్ కు తీసుకువెళ్లినట్లు పోలీసులు పక్కా ఆధారాలు చూపిస్తున్నారని అంటున్నారు. అయితే సత్యవర్థన్ హైదరాబాద్ వచ్చి వెళ్లాక వంశీ తాడేపల్లి ఎందుకు వచ్చారనేది మిస్టరీగా మారింది.

తాడేపల్లిలో జగన్ నివాసానికి వచ్చిన వంశీ పార్టీ విషయాలపై చర్చించారా? లేక ఇంకేమైనా సలహాలు తీసుకున్నారా? అనేది తెలియాల్సివుందని అంటున్నారు. మొత్తానికి పోలీసులు అడుగులు చూస్తుంటే కిడ్నాప్ కేసులో ఏదైనా సంచలన విషయం బయటపెడతారా? అనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.

Tags:    

Similar News