మునిగిన విజయవాడ...హైడ్రా రావాల్సిందే !

నగరాలు మునిగిపోతున్నాయి. వరుణుడి ప్రతాపానికి జలమయం అవుతున్నాయి. చిన్న పాటి వర్షానికే చిత్తడి అవుతున్నాయి.

Update: 2024-09-01 04:16 GMT

నగరాలు మునిగిపోతున్నాయి. వరుణుడి ప్రతాపానికి జలమయం అవుతున్నాయి. చిన్న పాటి వర్షానికే చిత్తడి అవుతున్నాయి. అది కాస్తా కుంభ వృష్టి అయితే నగరాలు నీటిలో తేలి ఆడాల్సిందే. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా నగరాలను వరుణుడు వణికించేస్తున్నాడు. ధాటీగా వాన కురిస్తే చాలు నగరాలు వెళ్ళి నీటి మీద నిలుచుంటాయి.

రోడ్ల మీద నీరు నదులను తలపిస్తుంది. దాంతో ఇళ్ళలోకి నీరు చేరి జనాలను అవస్థలకు గురి చేస్తుంది, రాజధాని నగరంగా ఉన్న విజయవాడకు ఇపుడు అలాంటి పరిస్థితే వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో వానలు భీకరంగా కురుస్తున్నాయి. విజయవాడలో అయితే ఒక్క శనివారమే ఏకంగా పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

దాంతో విజయవాడ నిండా మునిగింది. జల ప్రళయమే వచ్చింది. ఆకాశం చిల్లుపడినట్లుగా కురిసిన వాన అలాగే రోడ్ల మీద నిలిచిపోయింది. దానికి తోడు ఎటు చూసినా ఆక్రమణలు. కొండలను సైతం ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటి వెనకాల రాజకీయ నాయకుల అండ ఉంది.

దాంతో పాటు కాలువలను ఆక్రమించారు. వాన నీరు పోయే దారి కనిపించక రోడ్ల మీద నిలువెత్తు నిలిచి అది మరిన్ని ప్రమాదాలకు కారణం అవుతోంది. దాంతో విజయవాడకు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ రావాలని అంటున్నారు. ఎందుకంటే కృష్ణా నది కరకట్టను సైతం ఆక్రమించుకున్నారు. ఎటు చూసినా నివాసాలు కట్టేసుకుంటే వాన నీరు పోయేది ఎక్కడ అన్న ప్రశ్న తలెత్తుతోంది.

శనివారం నాటి వర్షాలలు కొండ చరియలు విరిగిపడి నలుగురు మరణించిన దారుణం జరిగింది అంటే ఆలోచించాల్సిన విషయమే. ఆక్రమణలకు లైసెన్స్ ఇచ్చినట్లుగా విద్యుత్ కనెక్షన్లు కూడా కల్పిస్తున్నారు. దాంతో అంతా బాగానే ఉన్నపుడు సాగినా తుఫానులు వచ్చినపుడే ప్రాణాలు పోతున్నాయి.

విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా దారుణంగా ఉందని అంటున్నారు. పాత కాలం నాటి వ్యవస్థ అది. కొత్తగా ఆధునీకరించలేదు, పెరిగిన జనాభాకు అనుగుణంగా లేదు. దాంతో కూడా వాన నీరు నిలిచిపోతోంది. ఈ విధంగా చూస్తే విజయవాడ వాన నీట మునగడంతో ఇపుడు అందరూ హైడ్రా అని కలవరిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఆక్రమించుకున్నారు అని కాదు, సిస్టం కి ఏది అడ్డంగా ఉంటే దాన్ని పక్కకు తప్పించాలి. కరకట్ట మీద ఆక్రమణలకు చెక్ పెట్టాలి.

డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా దారికి తేవాలి. ఆధునీకరించాలి. కాలువలను పూడిక తీసి పునరుద్ధరించాలి. అపుడే విజయవాడ భారీ వానలకు తట్టుకుని నిలబడుతుంది.వాన నీరు కూడా సజావుగా పల్లానికి పోతుంది. లేకపోతే విజయవాడకు వాన వస్తే నరకం అన్నది పదే పదే రుజువు అవుతుంది అంటున్నారు సగటు జనం.

Tags:    

Similar News