వీసా రెన్యువల్ కోసం భారతీయులకు తప్పిన తిప్పలు!
డిసెంబరు రెండో వారం నుంచి వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేసే ప్రయోగాత్మక విధానాన్ని అమలు చేసేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది
అమెరికాలో ఉంటున్న భారత పౌరులు తమ హెచ్-1బీ వీసాను రెన్యువల్ చేసుకునేందుకు భారత్‌కురావడమో.. లేక పొరుగున ఉన్న మెక్సికో, కెనడాలకు వెళ్లడమో తెలిసిందే. అయితే.. తాజాగా అమెరికా.. ఈ బాధ నుంచి భారత పౌరులకు విముక్తి కల్పించింది. అమెరికాలో ఉంటున్న భారత పౌరులు తమ వీసాలను అక్కడే రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాపర్యటన సందర్భంగా ఈ విషయాన్ని అగ్రరాజ్యం అధ్యక్షుడు జోబైడెన్‌తో చర్చించారు. దరిమిలా ఈ విషయంపై జోబైడెన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబరు రెండో వారం నుంచి వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేసే ప్రయోగాత్మక విధానాన్ని అమలు చేసేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. తొలి విడతలో 20 వేల మంది విదేశీ పౌరుల వీసాలను రెన్యువల్ చేయనుంది. వీరిలో భారత పౌరులే ఎక్కువగా ఉన్నారని.. వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ వెల్లడించారు. మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందన్నారు.
భారతీయులకు భారీ లబ్ధి
అమెరికా తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులకు అధిక లబ్ధి చేకూరనుందని.. భారత సంతతి పౌరులు తెలిపారు. తాజాగా కల్పించిన సదుపాయంతో భారతీయులు వీసా అపాయింట్‌మెంట్ కోసం తిరిగి భారత్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేగాక, భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలు కూడా కొత్త దరఖాస్తులపై దృష్టిపెట్టడం ద్వారా.. మరిన్ని వీసాలు లభించే అవకాశం ఉంది. కాగా, అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా (H-1B visa) అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికంగా ఉండడం గమనార్హం.