వైఎస్ సునీత ప్రాణాలకు ముప్పు ...ఎవరి వల్ల ?
వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అవుతారు అని ఎవరూ అనుకోలేదు. ఆయన 2019 మార్చి 15న అనూహ్యంగా మరణించారు.;

వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అవుతారు అని ఎవరూ అనుకోలేదు. ఆయన 2019 మార్చి 15న అనూహ్యంగా మరణించారు. ఇప్పటికి ఆరేళ్ళు అయింది కానీ ఆయన హత్య వెనక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసే ప్రయత్నమే సాగుతోంది తప్ప ఫలానా అని నిగ్గు తేల్చలేక పోతున్నారు.
తన తండ్రి హత్యకు కారకులు అయిన వారిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలని ఆయన ఏకైక కుమార్తె వైఎస్ సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తన అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసులో న్యాయం జరగలేదని ఆమె భావించారు. ఆమె సీబీఐ విచారణ కోరారు.
సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఆ మీదట చాలా జరిగాయి కానీ కేసు అయితే ఒక కొలిక్కి రాలేదు. ఈలోగా వరసబెట్టి సాక్షులు చనిపోతున్నారు. ఇదొక పరిణామంగా మారింది. ఇపుడు చూస్తే ఏకంగా సునీత ప్రాణాలకే ముప్పు ఉందని ఆమె సోదరి పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిలా మీడియా ముఖంగా ఇచ్చిన స్టేట్మెంట్ హీటెక్కిస్తోంది ఇద్దరు పిల్లలు సునీతకు ఉన్నారని ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని షర్మిల అంటున్నారు.
ఆమె తన కజిన్ బ్రదర్ కడప ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి మీదనే నేరుగా ఆరోపణలు చేశారు. బెయిల్ మీద ఈ కేసులో ఉన్న అవినాష్ రెడ్డి సాక్ష్యులను భయపెడుతున్నారని కూడా అన్నారు. ఒక్కొక్క సాక్షీ ఈ కేసులో చనిపోతూంటే సునీత ప్రాణాలకు ప్రమాదం ఉందని భయపడుతున్నట్లుగా షర్మిల చెప్పుకొచ్చారు.
అవినాష్ రెడ్డి బెయిల్ ని క్యాన్సిల్ చేయమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో ఉన్న వివిధ అంశాలను చూసిన మీదట సునీతకు ఏమి అవుతుదో అన్న ఆందోళన ఉందని అన్నారు. మరి సీరియస్ గా పాయింట్స్ ఏపీ ప్రభుత్వం ఆ పిటిషన్ లో ఏమి ఉంది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
ఇక షర్మిల ఆఖరుగా ఒకే మాట అనేశారు ఎంతకాలం బెయిల్ మీద అవినాష్ రెడ్డి ఉంటే అంతకాలం ఈ కేసులో సునీతకు న్యాయం జరగదు అని. అంటే అవినాష్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయించాలని ఆయనను జైలుకు పంపించాలనే డిమాండ్ ఆమె వినిపిస్తున్నారు అన్న మాట.
వివేకాను ఆయన కుమార్తె ఆమె భర్త మర్డర్ చేశారు అని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని షర్మిల ఖండిచారు. ఈ మర్డర్ కేసు తర్వాత ఆ సమయంలో అక్కడ ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డే కదా అని ఆమె అంటున్నారు. మొత్తానికి తన తమ్ముడు అయిన అవినాష్ రెడ్డి విషయంలో మరోసారి షర్మిల ఫైర్ అయ్యారు.
ఏడాది క్రితం ఎన్నికల వేళ ఆమె అవినాష్ మీద నిప్పులు చెరిగారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ సీటులో నిలబడ్డారు. ఇపుడు మళ్ళీ అవినాష్ రెడ్డిని వివేకా మర్డర్ కేసుని కలిపి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లో అంశాలు గురించి చెబుతున్నారు. సునీతకు ప్రాణ హాని ఉందని అంటున్నారు. మరి సునీతకు ప్రాణ హాని ఎవరి వల్ల అంటే ఎవరికి వారే దీనికి జవాబు చెప్పుకోవాలేమో.