స్టాలిన్ vs అమిత్ షా.. 'భాషా' యుద్ధం
తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమంతో లాభపడాలని స్టాలిన్ రాజేస్తున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల ‘భాషా’ యుద్ధం యమ రంజుగా సాగుతోందని అంటున్నారు.;
ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివీ.. ఇందులో ప్రజా ప్రయోజనాలు ఇసుమంత కనిపించడం లేదని రాజకీయ విశ్లేషఖులు అంచనావేస్తున్నారు. హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకోమంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ యుద్ధం చేస్తున్నారు.ఇక హిందీని తప్పనిసరి భాషగా అభ్యసించాలని కేంద్రంలోని బీజేపీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీన్ని హిందీ బాహుల్య ప్రాంతంలో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ యత్నిస్తుండగా.. తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమంతో లాభపడాలని స్టాలిన్ రాజేస్తున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల ‘భాషా’ యుద్ధం యమ రంజుగా సాగుతోందని అంటున్నారు.
-స్టాలిన్ ఏమన్నారంటే?
తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య త్రిభాషా సూత్రంపై వివాదం కొనసాగుతోంది. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అమలులో భాగంగా హిందీని తమపై రుద్దుతున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని మరోసారి విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై స్టాలిన్ స్పందిస్తూ, "ఎప్పటికీ గెలవలేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా, గాలి ఊరుకోదు. మమ్మల్ని రెచ్చగొట్టిన ఆయనకు లేఖాస్త్రాలతో సమాధానం చెబుతున్నాం" అని అన్నారు. ఎన్‌ఈపీని తిరస్కరించే తమిళనాడు ఇప్పటికే విద్యా రంగంలో అనేక లక్ష్యాలను సాధించిందని, తాము దిల్లీ ఆదేశాలను పాటించబోమని స్పష్టం చేశారు. భాజపా సర్కారు త్రిభాషా విధానంపై చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని ప్రధాన అజెండాగా చేసుకుంటామని స్టాలిన్ హెచ్చరించారు.
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లారిటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఈ అంశంపై స్పందించారు. చెన్నై సమీపంలోని రాణిపేటలో సీఐఎస్ఎఫ్ 56వ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాతృభాషలో పరీక్షలు రాసే అవకాశాన్ని కేంద్రం కల్పించిందని తెలిపారు. అలాగే తమిళనాడులో ఇంజినీరింగ్, వైద్య విద్యను తమిళంలో ప్రారంభించాలని స్టాలిన్‌ను కోరారు.
ఎన్‌ఈపీ ప్రకారం విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అయితే తాము ద్విభాషా విధానాన్ని కొనసాగిస్తామని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని ఉపేక్షించబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టాలిన్ కేంద్రంపై విమర్శలను కొనసాగిస్తూ సామాజిక మాధ్యమాల్లో వరుసగా పోస్టులు చేస్తున్నారు.