చావుబతుకుల్లో వివేకా హత్య కేసులో కీలక సాక్షి!

ప్రస్తుతం వివేకా వాచ్‌ మెన్‌ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన ప్రాణాలను కాపాడటానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

Update: 2024-07-04 10:07 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో 2019 ఎన్నికల ముందు మార్చి 15న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కీలక సాక్షిగా ఆయన ఇంటి వాచ్‌ మెన్‌ రంగన్న ఉన్నాడు. ఇప్పటికే పలుమార్లు పోలీసులకు, సీబీఐ అధికారులకు రంగన్న తన వాంగ్మూలమిచ్చాడు.

కాగా ప్రస్తుతం వాచ్‌ మెన్‌ రంగన్న చావు బతుకుల్లో పోరాడుతున్నాడని తెలుస్తోంది, వృద్ధాప్య సమస్యలతోపాటు ఆయనకు తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు మొదట పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి కడపలోని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)కు తీసుకెళ్లారు.

ప్రస్తుతం వివేకా వాచ్‌ మెన్‌ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన ప్రాణాలను కాపాడటానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

కాగా వివేకా హత్య కేసులో నిందితులపై అభియోగాలను రుజువు చేసేందుకు సీబీఐకి రంగన్న వాంగ్మూలం చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే సీబీఐకి తన వాంగ్మూలమిచ్చిన రంగన్న కోర్టులో మరోసారి అవే విషయాలను చెప్పాల్సి ఉంది.

కాగా వివేకా హత్య జరిగిన సమయంలో రంగన్న.. అక్కడే ఉన్నాడు. ఇంటి ఆవరణలోనే ఉన్న తోటలో నిద్రించాడు.

Read more!

కాగా హత్య విషయమై పోలీసుల ముందు పెదవి విప్పితే తీవ్ర పరిణామాలుంటాయని రంగన్నను కూడా నిందితులు బెదిరించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. మొదట్లో సీబీఐ అధికారులకు ఏమి చెప్పలేకపోయిన రంగన్న ఆ తర్వాత కీలక విషయాలను బయటపెట్టినట్టు సమాచారం.

రంగన్న వాంగూల్మం ఆధారంగానే సీబీఐ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డిల పేర్లను హత్య కేసులో చేర్చింది.

ఈ నేపథ్యంలో పలుమార్లు రంగన్నకు నిందితుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు టాక్‌.

ఈ నేపథ్యంలో వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో రంగన్న ఆరోగ్యం విషమించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ప్రస్తుతం ఆయన కడపలోని రిమ్స్‌ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

Tags:    

Similar News

eac