"ఒకే దేశం- ఒకే ఎన్నిక"... పటిష్ఠమైన ప్రజాస్వామ్యంపై ఖర్గే రియాక్షన్!

అవును... "ఒకే దేశం- ఒకే ఎన్నిక" ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.

Update: 2024-01-19 13:12 GMT

మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని సైతం కేంద్రం నియమించింది! ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదిస్తోన్న "ఒకే దేశం - ఒకే ఎన్నిక" విధానం హేతుబద్ధతపై పలువురు నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందించారు.

అవును... "ఒకే దేశం- ఒకే ఎన్నిక" ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది పూర్తిగా విరుద్ధం అని పేర్కొంది. ఈ సందర్భంగా... ఈ జమిలి ఎన్నికలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌ నాథ్‌ కోవింద్‌ కమిటీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ సందర్భంగా కీలక విషయాలను ప్రస్థావించారు.

ఇందులో భాగంగా... రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ కమిటీ ఛైర్మన్‌ తన వ్యక్తిత్వాన్ని, మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు కేంద్రాన్ని అనుమతించవద్దని.. తమ పార్టీ, దేశ ప్రజల తరఫున అభ్యర్థిస్తున్నట్లు ఖర్గే పేర్కొన్నారు. దేశంలో పటిష్ఠమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే.. తక్షణం ఈ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు.

ఇదే సమయంలో... జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని కోరిన ఖర్గే... ఒకే కాలంలో దేశమంతటా ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయకుండా... వారి ఆదేశాన్ని గౌరవించేలా ప్రభుత్వం, పార్లమెంట్, ఎలక్షన్ కమిషన్ కలిసి పని చేయాలని కోరారు.

కాగా... గతంలో ఇదే విషయంపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... "దేశానికి ఏది ముఖ్యం? ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలా..? లేక, ఒకే దేశం - అందరికీ ఒకే రకమైన (ధనిక, పేదలందరికీ సమానంగా) నాణ్యమైన విద్య, వైద్యమా..? అసలు జమిలి ఎన్నికలతో సామాన్యుడికి కలిగే మేలు ఏంటి?" అని ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

ఇదే సమయంలో... లోక్‌ సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలకు ఉద్దేశించిన "ఒకే దేశం - ఒకే ఎన్నిక" భావనతో తాను ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రామ్‌ నాథ్‌ కోవింద్‌ కమిటీకి లేఖ రాసిన ఆమె... "నేను నిరంకుశత్వానికి వ్యతిరేకం.. అందువల్లే జమిలి ఎన్నికలకూ దూరం" అని పేర్కొన్నారు.

Tags:    

Similar News