ఒత్తిడికి అసలు కారణాలు ఇవేనా.. సర్వే ఏం చెబుతోంది?

స్ట్రెస్‌.. ప్రెజర్‌.. ఒత్తిడి.. ఇలా పదాలు ఏవైనా ఇటీవల కాలంలో అంతా దీనిబారిన పడుతున్నారు.

Update: 2024-09-18 07:08 GMT

స్ట్రెస్‌.. ప్రెజర్‌.. ఒత్తిడి.. ఇలా పదాలు ఏవైనా ఇటీవల కాలంలో అంతా దీనిబారిన పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీన్ని తట్టుకోలేక అర్థాంతరంగా గుండెపోట్లకు గురవుతున్నారు లేదా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వ్యాధులకు ఆస్పత్రులు ఉన్నట్టే.. ఒత్తిడితో వచ్చే మానసిక వ్యాధులకు సైతం ప్రత్యేక ఆస్పత్రులు వస్తున్నాయి. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల సంఖ్య పెరుగుతోంది.

అసలు ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది.. అంటే ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం. ఇందులో అందరికంటే ముందుండాలనే తపన, లేదంటే తాము ఇతరుల కంటే ఎక్కడ వెనుకబడిపోతామోనన్న భయం, ఇక విద్యార్థులకయితే పరీక్షల్లో మార్కుల భయం, పోటీ పరీక్షల్లో ర్యాంకు వస్తుందో, రాదోనన్న ఒత్తిడి, ఓవైపు తల్లిదండ్రుల నుంచి, ఇంకోవైపు అధ్యాపకుల నుంచి ఇలా అన్ని వైపులా చుట్టుముడుతున్న ఒత్తిడితో చిత్తవుతున్నారు.

ఇప్పుడు అందరికీ అన్నిటికంటే ఒత్తిడే ప్రధాన సమస్యగా మారుతోంది. మంచి జీతం రావాలన్నా, కెరీర్‌ లో ఉన్నతంగా ఎదగాలన్నా ఎక్కువ పనిగంటలు ఆఫీసులో వెచ్చించాల్సి వస్తుంది. దీంతో పర్సనల్‌ లైఫ్‌ కు వెచ్చించే సమయం తగ్గిపోతోంది. కంటినిండా 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా అంత సమయం ఈ పోటీ ప్రపంచంలో ఎవరికీ ఉండటం లేదని అంటున్నారు.

ఒకప్పుడు నడి వయసు అంటే 60 ఏళ్లు దాటాకే గుండెపోట్లు సంభవించేవి. ఇప్పుడు 30 ఏళ్లలోపే గుండెపోట్ల బారినపడుతున్నారు. చివరకు 16, 17 ఏళ్ల యువకులు సైతం గుండెపోటుతో అకాల మృత్యువు పాలు కావడం సర్వత్రా ఆందోళన రేపుతోంది.

కంటినిండా నిద్ర, సమతుల ఆహారం, రోజూ కనీసం అరగంట సేపైనా నడక, యోగా, వ్యాయామం ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూర్చుని ఎక్కువసేపు పనిచేసేవారు అనేక వ్యాధుల బారినపడుతున్నారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ప్రొఫెషనల్‌ లైఫ్‌ ను, పర్సనల్‌ లైఫ్‌ ను బ్యాలెన్స్‌ చేసుకోలేక ఒత్తిడి బారినపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. పర్సనల్‌ లైఫ్‌ కు కూడా వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం, కనీసం ఏడాదికి రెండుసార్లయినా ఏవైనా విహార యాత్రలకు వెళ్లిరావడం, మంచి సంగీతం వినడం, రోజూ 8 గంటలు నిద్రించడం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఒత్తిడిపోయి మళ్లీ తాజాదనం సంతరించుకోవాలంటే ఈ టిప్స్‌ పాటించాలంటున్నారు.

ఇటీవల భారతీయ వెల్నెస్‌ సంస్థ.. యువర్‌ దోస్త్‌ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్టు వెల్లడైంది. అదే సమయంలో 40 ఏళ్ల పైబడిన వాళ్లు కాస్త ప్రశాంతంగా ఉంటున్నారని తేలింది.

5000 మంది భారతీయ ఉద్యోగులపై జరిపిన సర్వే ఆధారంగా యువర్‌ దోస్త్‌ కొన్ని విషయాలను వెల్లడించింది. ఆఫీసు పని వేళలు, భవిష్యత్తుపై ఆందోళన వంటి కారణాలతో 21 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే వెల్లడించింది.

అధిక ఒత్తిడికి గురవుతున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. యువర్‌ దోస్త్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది మహిళలు తాము మానసిక ఆందోళన చెందుతున్నామని వెల్లడించారు. పని, కుటుంబ జీవితం ఈ రెండింటి మధ్య సమతుల్యత కోల్పోవడం వల్లే ఈ తరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. ఫలితంగా వ్యక్తిగత జీవితంలో సంతోషమనేది ఉండటం లేదని వాపోయారు.

Tags:    

Similar News