అమ్మ మీద అంత మాట అనేయటమా జగన్?
ఆస్తులకు సంబంధించిన వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన పిటిషన్ ను దాఖలు చేశారు.;
ఆస్తులకు సంబంధించిన వివాదంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన పిటిషన్ ను దాఖలు చేశారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తాజాగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కు తన వాదనను వినిపించారు. దీనికి సంబంధించిన పిటిషన్ ను దాఖలు చేశారు. అందులో తల్లి విజయమ్మను ముందు పెట్టుకొని తన పంతం నెగ్గించుకోవటానికి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నట్లుగా జగన్ పేర్కొన్నారు.
సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలనని పేర్కొన్న జగన్.. ‘ఆమెపై గౌరవం ఉంది. చెల్లి వెనకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవటానికే ఈ పిటిషన్ వేశాను’’ అంటూ పేర్కొన్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ రిజిస్టర్ లో వాటాదారుల పేర్లను సవరించి.. తమ వాటాల్ని పునరుద్ధరించాలని జగన్.. భారతిరెడ్డి.. క్లిసిక్ రియాల్టీలు పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.
ఈ సందర్భంగా తల్లి విజయమ్మ వేసిన కౌంటర్ తో పాటు సరస్వతి పవర్ డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి వేసిన కౌంటర్లు.. తన పిటిషన్ నుంచి తొలగించాలని పేర్కొంటూ షర్మిల పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సమాధానం ఇస్తూ జగన్ అఫిడవిట్ దాఖలు చేశారు. షర్మిల అత్యాశ వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగిందని. మొత్తం వ్యవహారాన్ని షర్మిల ప్లాన్ ప్రకారం తల్లిని ముందు ఉంచి నడిపించిందన్నారు.
వ్యక్తిగత.. రాజకీయ విభేదాలతో తల్లి.. ఇతరులను అడ్డు పెట్టుకొని వాటాలు బదలాయించటం వల్ల తమకు నష్టం జరిగిందని.. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండేందుకు తాను.. భారతీ .. అమ్మ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదన్నారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని.. నిర్వహణలో భాగస్వామి కాలేదన్న జగన్.. ‘ఏ నష్టాలకూ హామీ ఇవ్వలేదు. కంపెనీలపై నమోదైన కేసుల్ని ఎదుర్కోలేదు. అయినా తల్లిని బలిపశువును చేసి.. మా వాటాలు లాక్కోవటానికి ప్రయత్నిస్తోంది’’ అంటూ కీలక విషయాల్ని వెల్లడించారు.
గిఫ్టు డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదని.. వాటాల సర్టిఫికేట్లను తామింకా తల్లికి అందజేయలేదని.. వాటాల్ని బదలాయించలేదని పేర్కొన్నారు. అసంపూర్తి గిఫ్ట్ డీడ్ తో వాటాల బదలాయింపు పూర్తైనట్లు కాదన్న జగన్.. చట్టప్రకారం బదలాయింపు జరిగితేనే.. చెల్లుబాటు అవుతుందన్నారు. సరస్వతి పవర్ లోని వాటాలను కోర్టు కేసులన్నీ పూర్తయ్యేవరకు అమ్మ వద్ద ఉంచామని.. షర్మిల వల్లే తన తల్లి విజయమ్మ ట్రైబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా జగన్ పేర్కొన్నారు.
చెల్లితో ఉన్న వ్యక్తిగత.. రాజకీయ విభేదాలతో పిటిషన్ వేశామని పేర్కొనటం సరికాదన్న జగన్.. క్లాసిక్ రియాల్టీలోని వాటాల బదలాయింపుతో సరస్వతి పవర్ లో 48.99 శాతం వాటా ఉందన్నది వాస్తవమన్నారు. గిఫ్టుడీడ్ ఇచ్చినంత మాత్రాన వాటాలు బదలాయించినట్లు కాదని.. ఆ వాటాలపై పూర్తి హక్కులు దాతవేనని పేర్కొన్నారు. చెల్లిపై ఉన్న ప్రేమ.. వాత్సల్యంతో నా ఆస్తులను భవిష్యత్తులో ఆమెకు ఇవ్వాలని అనుకున్నానని.. అందుకే ముందస్తు తేదీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పేర్కొన్నారు.
కేసులన్నీ తేలాకే అంటూ ఎంవోయూలో స్పష్టంగా ఉందన్న జగన్.. అలాంటి ఒప్పందమేదీ లేదని చెప్పటం అబద్ధమన్నారు. షర్మిల మోసపూరిత చర్యతో ఆ ఒప్పందం ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత దానని రద్దు చేసుకున్నట్లుగా గతంలోనే చెప్పామని.. ఆ విషయాన్ని ట్రైబ్యునల్ పరిగణలోకి తీసుకోవాలన్నారు. వాటాల అక్రమ బదలాయింపునకు కారణం షర్మిలే అన్న జగన్.. గతంలో ఉన్న ప్రేమ.. అప్యాయతలు.. ఆమె చేసిన మోసం కారణంగా ఇప్పుడు లేవన్నారు. పాత తేదీలతో క్రియేట్ చేసిన పత్రాలతో తప్పుడు అఫిడవిట్లతో మోసగించారన్నారు. తన ఆస్తిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేస్తూ నిర్ణయిం తీసుకున్నారు.