జగన్ వర్సెస్ అదర్స్: అసలు అర్ధం చేసుకోరూ ?
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ని ఎవరూ అర్ధం చేసుకోవడం లేదా లేదా ఆయనే ఎవరికీ అర్థం కావడం లేదా అన్నది అంతు పట్టడం లేదు.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ని ఎవరూ అర్ధం చేసుకోవడం లేదా లేదా ఆయనే ఎవరికీ అర్థం కావడం లేదా అన్నది అంతు పట్టడం లేదు. అంతే కాదు వైఎస్ జగన్ కూడా ఎదుటి వారిని అర్థం చేసుకునే విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది పార్టీ లోపలా బయటా చర్చ సాగుతోంది.
వైసీపీ ఏపీలో ఓటమి పాలు అయి ఆరు నెలల కాలం గడచిపోయింది. వైసీపీని వీడుతున్న వారు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే వైసీపీని వదిలి వెళ్తున్న వారు అంతా వైఎస్సార్ కి వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా చలామణీ అయిన వారే కావడం విశేషం.
వారు పార్టీ నుంచి వేరు పడతారని ఎవరూ కూడా కలలో కూడా ఊహించి ఉండరు, మామూలుగా అయితే వారి మీద ఎంతకైనా పందెం కట్టేందుకు కూడా రెడీ అవుతారు. కానీ ఇపుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారి లిస్ట్ చూస్తే కనుక అంతా వైఎస్సార్ ప్రోత్సాహంతో ఎదిగి వచ్చిన వారే. వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారే కావడం విశేషం.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడుతారు అని ఎవరైనా ఊహించారా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఆయనకు వైఎస్సార్ అంటే ఎంతో ఆరాధన. అలాగే వైసీపీలో ఆయన కీలకంగా పనిచేసిన వారు. జగన్ సైతం ఆయన 2014, 2019లలో ఓటమి పాలు అయినా పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు. అలా కొన్నాళ్ళు అయ్యాక ఆయనను రాజ్యసభకు పంపించారు.
కానీ ఆయన పార్టీ ఓటమి చెందగానే వీడి వెళ్ళిపోయారు. అఫ్ కోర్సు ఇక్కడ ఎవరి వాదనలు వారికి ఉన్నాయనే చెప్పాలి. మరో వైపు చూస్తే ఆళ్ళ నాని కూడా అంతే. ఆయనకు కూడా జగన్ 2014 లో ఓటమి చెందితే వైసీపీ కోటా కింద వచ్చిన ఎమ్మెల్సీ సీట్లలో అగ్ర తాంబూలం ఇచ్చి పెద్దల సభలో అకామిడేట్ చేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలను అప్పగించారు. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు అందరితో పాటే విస్తరణలో ఆయనకు పదవి పోయింది. ఇక ఆయన పార్టీకి రాజీనామా చేసేంతవరకూ వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గానే ఉన్నారు.
ఇక మరో నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన జగన్ కి దగ్గర బంధువు కూడా. ఆయన పార్టీని వీడిపోతారని ఎవరూ అసలు అనుకోని ఉండరు. కానీ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేనలోకి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ వైసీపీలలోనే మొత్తం రాజకీయ జీవితం గడిపారు. ఇపుడు వేరు పడ్డారు.
అదే విధంగా వాసిరెడ్డి పద్మ. ఆమె విషయం కూడా అంతే. పార్టీ విపక్షంలో ఉన్నపుడు పార్టీ పదవులు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కేబినెట్ ర్యాంక్ పదవి అయిన మహిళా చైర్ పర్సన్ ని ఇచ్చారు. కానీ ఆమె కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఇదే వరసలో ఇంకా అనేక మంది ఉన్నారు. ఇక వెళ్ళిన వారు అంతా జగన్ ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన మీద నానా రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ వారిని నమ్మి అందలం ఎక్కించారు అనుకుంటే వారు జగన్ తమకు అన్యాయం చేశారని అంటున్నారు. మరి తేడా ఎక్కడ వస్తోంది.
జగన్ వారిని అర్ధం చేసుకోవడంలోనా లేక వారే జగన్ ని అర్ధం చేసుకోవడంలోనా అన్నదే చర్చగా ఉంది. ఇక జగన్ తనదైన కోణంలో నుంచి ఆలోచిస్తారు అని అంటారు. ఆయన నమ్మి పదవులు ఇస్తారు. అయితే ఆ విషయంలో ఆయన వారిని అతిగా నమ్మేశారా అంటే అవును అంటున్నాయి పార్టీ వర్గాలు. కొందరి విషయంలో జగన్ అయిన వారికి ఆకులు పెట్టి కాని వారికి కంచాలలో వడ్డించారు అని కూడా పార్టీలో విమర్శలు ఉన్నాయి.
ఇక్కడ మరో మాట ఉంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి. అది కూడా వారు ఒకటికి పది సార్లు అడిగినపుడు పెడితే ఇంకా బాగా గుర్తు ఉంటుంది. కానీ వారికి అడగకుండా ఎన్ని ఇచ్చినా లేక వారు కోరుకున్నది ఒకటైతే అంతకు ఎక్కువగా మరొకటి ఇచ్చినా కూడా వర్కౌట్ కాదు. పాలిటిక్స్ లో అసలు ఆ లెక్కలు కుదరవు. అందుకే జగన్ కి ఈ దెబ్బలు అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత రాజకీయంగా చాలా నేర్చుకోవాల్సి ఉందని అంతున్నారు. ముఖ్యంగా తాను అనుకోవడం కాదు, ఎదుటి వారు ఏమనుకుంటున్నారు అని అక్కడ తొంగి చూసి ఆ విధంగా తనకు ఉన్న అవకాశాల మేరకు వారికి అకామిడేట్ చేస్తేనే వారు బాగా గుర్తుంచుకుంటారు అని అంటున్నారు.