జొమాటో ఉద్యోగులకు పండగ.. రూ.330 కోట్లు ఇచ్చేసిన కంపెనీ
పని ప్రామాణికతను అంచనా వేసి.. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులకు స్టాకులను పంచింది.
జొమాటో.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దాదాపు 24 గంటల పాటు ఆహార సరఫరాలో ముందున్న సంస్థ. దాదాపుఅతి తక్కువ సమయంలో ఫుడ్ డెలివరీ చేస్తూ.. వినియోగదారుల హృధయాలను కూడా చూరగొంది. అలాంటి సంస్థ ఇప్పుడు.. ఉద్యోగుల కష్టాలను కూడా తన కష్టాలుగా భావించి వారికి ఆర్థికంగా దన్నుగా నిలిచింది. స్టాక్ మార్కెట్‌లో జొమాటోకు భారీసంఖ్యలో షేర్లు ఉన్నాయి. వీటిలో కోటీ 20 లక్షల స్టాక్స్‌ను ఉద్యోగులకు ఇచ్చేసింది. పని ప్రామాణికతను అంచనా వేసి.. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులకు స్టాకులను పంచింది.
దీంతో ఉద్యోగులకు సంస్థలో భాగస్వాములు కావడం గమనార్హం. జొమాటో తెలిపిన వివరాల ప్రకారం.. 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు సంస్థ అంగీకారం తెలిపింది. ఈ షేర్ల విలువ సుమారు 330 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఈ విషయాన్ని జొమాటో తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. కాగా, కంపెనీ మొత్తం షేర్లలో ఈఎస్ఓపీ 2021 నుంచి 1,19,97,652 షేర్లు.. మిగిలిన 116 షేర్లు ‘ఫుడ్డీ బే ఈఎస్ఓపీ 2014’ స్కీమ్ కిందకు వస్తాయి.
అయితే ఉద్యోగలుకు కేటాయించిన షేర్లు లాకిన్ ప్రక్రియకు లోబడి ఉండవని పేర్కొంది. అంటే.. ఉద్యోగులు తమకు వీలు అయిన సమయంలో వీటిని విక్రయించుకునే అవకాశం ఉంది. తద్వారా ఉద్యోగులు ఆ సొమ్మును తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ప్రస్తుతం జొమాటో షేల్ వాల్యూ రూ.275.20గా ఉందని కంపెనీ వివరించింది. ఉద్యోగులను మరింత అంకిత భావంతో ప్రోత్సహిం చేందుకు ఇలాంటి చర్యలు దోహదపడతాయని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా రేయింబవళ్లు తమ ఉద్యోగులు అందిస్తున్న సేవలకు ఇది చిరు కానుకగా పేర్కొంది. కాగా, ఏ తరహా ఉద్యోగులకు ఈ షేర్లు ఇవ్వాలనే అంశంపై జొమాటో ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేసి వడపోత ప్రక్రియ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేయనుంది.