బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు సంచలనం
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది.;

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బుధవారం జరిగిన విచారణలో స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, కోర్టులు స్పీకర్‌కు గడువు విధించడం సరికాదని వాదించారు. దీనికి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కోర్టులు చూస్తూ ఉండాలా? గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. అయితే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పిటిషనర్లు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ స్పీకర్‌కు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు కల్పించిందని, ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని వాదించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదని, డివిజన్ బెంచ్ తీర్పు సరైనదని ఆయన అన్నారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయకూడదని ఆయన పేర్కొన్నారు.
ఈ వాదనలపై జస్టిస్ గవాయ్ తీవ్రంగా స్పందించారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయని, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీంకోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా అని నిలదీశారు. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్ గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయాన్ని గుర్తు చేశారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? అని ఆయన ప్రశ్నించారు.
అయితే ఆ ఘటన ప్రత్యేకమైనదని రోహత్గీ బదులిచ్చారు. సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉందని, ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని ఆయన వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారని, కనీసం ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా పిటిషన్లు దాఖలు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు.
స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారని రోహత్గీ కోర్టుకు తెలిపారు. పిటిషనర్లు 2024 మార్చి 18న ఫిర్యాదు చేయగా, స్పీకర్ 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు.
అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సమయం కోరడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కాగా, గత విచారణలోనూ సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిరాయింపులను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, నిర్ణయం తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.