జూదం స్కాంలో ఇండియన్ అమెరికన్ నేత
భారతీయ సంతతికి చెందిన రాజకీయ నాయకుడు, న్యూజెర్సీ కౌన్సిల్ సభ్యుడు ఆనంద్ షా ఒక పెద్ద అక్రమ జూదం కుంభకోణంలో నిందితుల్లో ఒకరిగా తేలారు.;

భారతీయ సంతతికి చెందిన రాజకీయ నాయకుడు, న్యూజెర్సీ కౌన్సిల్ సభ్యుడు ఆనంద్ షా ఒక పెద్ద అక్రమ జూదం కుంభకోణంలో నిందితుల్లో ఒకరిగా తేలారు. రెండేళ్ల పాటు సాగిన దర్యాప్తు అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 39 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరు 3 మిలియన్ డాలర్లకు పైగా అక్రమ జూదంలో పాల్గొన్నారని, వీరికి లుక్కేస్ అనే నేర ముఠాతో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
అధికారుల కథనం ప్రకారం.. ఆనంద్ షాతో పాటు లుక్కేస్ కుటుంబానికి చెందిన సీనియర్ సభ్యుడు జార్జ్ జప్పోలా ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారులుగా గుర్తించబడ్డారు. వీరు కలిసి ఒక పెద్ద అక్రమ జూదం నెట్‌వర్క్‌ను నడిపించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ సందర్భంగా న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాట్ ప్లాట్కిన్ మాట్లాడుతూ, వ్యవస్థీకృత నేరాలు కాలంతో పాటు తమ రూపురేఖలు మార్చుకున్నప్పటికీ, వాటి మూలాలు మాత్రం మారలేదని అన్నారు. "ముఖ్యంగా ఆన్‌లైన్ భాగం మారినప్పటికీ ఇది పాత కథే. దురాశ , అధికారం కోసం తపించే నేరస్థులు చట్టానికి అతీతులమని భావిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
నివేదికల ప్రకారం.. ఆనంద్ షా ఒక ఆన్‌లైన్ స్పోర్ట్స్ బుక్‌ను నిర్వహించడంలో చట్టవిరుద్ధమైన పోకర్ ఆటలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు టోటోవా, గార్‌ఫీల్డ్, వుడ్‌ల్యాండ్ పార్క్ ,పాటెర్సన్‌లలో నాలుగు చట్టవిరుద్ధ బెట్టింగ్ స్థలాలను గుర్తించారు. ఈ స్థలాల ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన అమెరికాలోని భారతీయ సంతతి రాజకీయ నాయకులపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఆనంద్ షాపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణకు రానుంది.