దుస్తులే దొరికాయి.. సుదీక్ష జాడలేదు.. బీచ్ లో అసలేమైంది?
డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.;
డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మార్చి 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన సుదీక్ష ఆచూకీ ఇప్పటికీ మిస్టరీగానే ఉండగా తాజాగా బీచ్ వద్ద ఆమె దుస్తులు లభ్యం కావడం కలకలం రేపుతోంది. పోలీసులు ఆమె కోసం విస్తృతంగా గాలిస్తుండగా, బీచ్‌లోని లాంజ్ కుర్చీలో సుదీక్ష దుస్తులు ఉన్నట్లు కొన్ని దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సుదీక్ష దుస్తులు కొంతమేర మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. ఆమె నీటిలోకి వెళ్లే ముందు వాటిని అక్కడ వదిలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చివరిసారిగా సుదీక్ష ధరించిన దుస్తులు ఇవేనని భావిస్తున్నారు. వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోణంకి, మరో ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ప్యూంటా కానాకు విహారయాత్రకు వెళ్లింది. మార్చి 6న స్థానిక రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ వద్ద ఆమె చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత తన గదికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
పోలీసులు సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మార్చి 6వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు సుదీక్ష తన స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమె ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్ట్ జాషువా స్టీవెన్ రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.
ఈ కేసులో కొత్త కోణాన్ని వెలుగులోకి తెస్తూ, సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా కూడా దర్యాప్తు చేపట్టాలని వారు పోలీసులను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే బీచ్ వద్ద సుదీక్ష దుస్తులు కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆమె ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిందా? లేక కిడ్నాప్ నకు గురైందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి.
సుదీక్ష దుస్తులు లభ్యం కావడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ దుస్తులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపే అవకాశం ఉంది. జాషువా స్టీవెన్ రిబెను మరింత లోతుగా విచారించే అవకాశం కూడా ఉంది. సుదీక్ష ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లోనూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో వేచి చూడాలి.