మావాళ్లు అమెరికా వెళ్లారా? డిపోర్టేషన్ కుటుంబాలకూ తెలియని వైనం

ఆ అమ్మాయి పేరు నికితా పటేల్.. గుజరాత్ కు చెందిన యువతి.. ఆ రాష్ట్ర ప్రజల్లో చాలామందికి జీవితంలో ఎదగాలని ఉంటుంది.

Update: 2025-02-06 11:51 GMT

ఆ అమ్మాయి పేరు నికితా పటేల్.. గుజరాత్ కు చెందిన యువతి.. ఆ రాష్ట్ర ప్రజల్లో చాలామందికి జీవితంలో ఎదగాలని ఉంటుంది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం వారు నిరంతరం తపిస్తుంటారు. నికితా కూడా అంతే.. అందుకే ‘అమెరికా’ వెళ్లిపోయింది.

గుజరాత్‌ కే చెందిన కిరణ్ సింగ్ గోహిల్ ది మరో గాథ. తన భార్య, కుమారుడితో కలిసి ఇతడూ అమెరికా వెళ్లాడు. తర్వాత కుటుంబాన్ని తిప్పి పంపించేశాడు. అయితే, వీరు ఎప్పుడు వెళ్లారు? ఎలా వెళ్లారు? అన్న సంగతి ఆ గ్రామంలోని వారికే తెలియదట.

రెండు రోజుల కిందట అమెరికా ప్రభుత్వం పంపించివేసిన అక్రమ వలసదారుల్లో పైన చెప్పుకొన్న ఇద్దరూ ఉన్నారు. వీరేకాదు చాలామంది వారు అమెరికా వెళ్లినట్లు వారి కుటుంబ సభ్యులకే తెలియదట. తీరా అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉంటున్నారంటూ వెనక్కుపంపాక విషయం బయటపడింది.

104 మందితో అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం నుంచి బయల్దేరిన విమానం పంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ చేరింది. వీరిలో అధికులు పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే. కొందరి కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్లు అమెరికా వెళ్లిన సంగతే తెలియదని చెబుతుండడంతో అధికారులూ ఆశ్చర్యపోతున్నారు.

మా అమ్మాయి చివరిసారి ఫోన్‌ లో మాట్లాడినప్పుడు కూడా తాను అమెరికాలో ఉన్న విషయం చెప్పలేదని నికిత తండ్రి తెలపడం గమనార్హం. గుజరాత్ కే చెందిన కేతుభాయ్ పటేల్ సూరత్‌ లో ఉన్న తన ఫ్లాట్ అమ్మేసి అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాడు. ఇప్పుడు అక్కడినుంచి పంపించేయడంతో అతడి కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోనుంది. నెల కిందట నికిత స్నేహితులతో కలిసి యూరప్ వెళ్తానని చెప్పి బయల్దేరింది.

తన కుమారుడి కుటుంబం అమెరికా వెళ్లిన సంగతి తెలియదని.. పదిహేను రోజులుగా ఫోన్‌ కూడా లేదని కిరణ్ సింగ్ తల్లి వాపోయింది.

డిపోర్టేషన్ తో అక్రమ వలసదారుల అంశం చర్చనీయంగా మారుతోంది. కుటుంబాలకూ తెలియకుండా వెళ్లడం, అక్కడ ఇబ్బందులు పడడం చివరకు వారికే కాదు.. దేశానికీ ఇబ్బందికరమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా విదేశాలకు వెళ్లేవారికి భవిష్యత్తు లో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News