బియ్యం గురించి ఎన్నారైలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!

యుఎస్‌ లో నివసిస్తున్న భారతీయులు బియ్యం లభ్యత గురించి ఆందోళన

Update: 2023-07-25 04:26 GMT

గత రెండు మూడు రోజులుగా అమెరికాలోని భారతీయులు, మరి ముఖ్యంగా తెలుగువారు బియ్యం విషయంలో ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. యూఎస్ కు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను భారతదేశం నిషేధించిందనే వార్తలతో అక్కడున్న భారతీయులు ఆందోళన చెందారు. ఫలితంగా రైస్ దుకాణాలముందు క్యూ కట్టారు.

అయితే యుఎస్‌ లో నివసిస్తున్న భారతీయులు బియ్యం లభ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దేశంలో తగినంత బియ్యం నిల్వలు ఉన్నాయని భారత్ లోని ఎగుమతిదారులు హామీ ఇస్తున్నారు. యుఎస్‌ లో బియ్యం కోసం దుకాణాల వద్ద క్యూలో నిల్చున్న వినియోగదారులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. యుఎస్‌ లో సుమారు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం భారతదేశం నుండి రవాణా చేయబడుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఈ నిల్వలు ఆరు నెలల పాటు కొనసాగుతాయని అంచనా వేసి చెబుతున్నారు. ఇదే క్రమంలో... ప్రవాస భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర ప్రభుత్వం త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని బియ్యం ఎగుమతిదారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ప్రతినెలా సగటున 6,000 మెట్రిక్‌ టన్నుల బాస్మతీయేతర బియ్యం భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతుండగా.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లు 4,000 మెట్రిక్‌ టన్నులు సమకూరుస్తున్నాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.

ఇదే సమయంలో యూఎస్ లోని భారతీయులు బియ్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని, ప్రశాంతంగా ఉండాలని సూచిస్తూ.. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ.. కొరత భయాలు ఎక్కువ కాలం ఉండవని భరోసా ఇస్తున్నారు హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ బియ్యం ఎగుమతిదారు డెక్కన్ గ్రెయిన్స్ ఇండియా డైరెక్టర్ కిరణ్ కుమార్ పోలా.

అంతేకాకుండా... అమెరికాలోని భారతీయులలో ప్రసిద్ధి చెందిన సోనా మసూరి బియ్యాన్ని నిషేధం నుండి మినహాయించాలని కిరణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాస్మతీయేతర బియ్యం కోసం ప్రత్యేక వర్గీకరణలను రూపొందించాలని.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మంచి ధర, పంపిణీ ఎగుమతి అవకాశాల కోసం బియ్యం రకాలను నియంత్రించాలని ఆయన సూచించారు.

ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారతదేశం వాటా 40 శాతం.. కాగా, ఈ నిషేధం వల్ల ఇతర దేశాలకు సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర బియ్యం నెలవారీ ఎగుమతిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇదే సమయంలో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధంతో రూ.8,200 కోట్ల విలువైన 20 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి ఆర్డర్లు తక్షణమే రద్దయ్యే ప్రమాదం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

2023-24 రబీ సీజన్‌ లో పంట సరిగా లేకపోవడం, ఇదే సమయంలో తూర్పు, దక్షిణ భారతదేశంలో లోటు వర్షపాతం, ఉత్తరాదిలో అధిక వర్షాల కారణంగా ఖరీఫ్ పంటలో తక్కువ పంటల సాగు కారణంగా.. గత మూడు నెలల్లో దేశీయ బియ్యం ధరలు 20-30 శాతం పెరిగాయి.

అయితే, భారతదేశం నుండి నాన్-బాస్మతీ వైట్ రైస్ ఎగుమతులపై ఇటీవల నిషేధం వార్తలతో యూఎస్ లోని ఎన్నారైలలో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో బియ్యం దుకాణాలు ఎన్నారై వినియోగదారులతో నిండిపోయాయి. కొరత భయంతో ప్రజలు పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయడానికి దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. ఫలితంగా కొన్ని చోట్ల రెట్టింపు ధరలు పలుకుతున్నాయని తెలుస్తుంది.

దీంతో… యూఎస్ లోని భారతీయులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతదేశంలోని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.

Tags:    

Similar News